రూ.20 వేల కోట్లు నీళ్లపాలు.! కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు వృథా

రూ.20 వేల కోట్లు నీళ్లపాలు.! కాళేశ్వరం మూడో టీఎంసీ  పనులు వృథా
  • కాళేశ్వరం మూడో టీఎంసీ పేరిట గత బీఆర్ఎస్​ సర్కార్ దండుగ ఖర్చు 
  • డీపీఆర్ వెనక్కి పంపి, ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగించిన సీడబ్ల్యూసీ 
  • అదనపు టీఎంసీతో ప్రయోజనం లేదని ఆనాడే కాగ్ చెప్పినా వినని గత ప్రభుత్వం
  • ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలు కూడా దాటని ఆయకట్టు 
  • అందులోనూ ఎల్లంపల్లి ఎత్తిపోతలతోనే 98 వేల ఎకరాలకు నీళ్లు   
  • గోదావరి బేసిన్​లోని ఎస్సారెస్పీ ద్వారానే ఆయకట్టుకు జలాలు

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మూడో టీఎంసీ పనులు వృథా అయ్యాయి. ఈ అదనపు టీఎంసీ పనులను ఇప్పటికే కాగ్​తప్పుపట్టగా.. తాజాగా ఆ మూడో టీఎంసీ కోసం ఇచ్చిన డీపీఆర్​లను సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) వెనక్కి పంపించింది. ఆ ప్రాజెక్టును అప్రైజల్​లిస్టు నుంచి కూడా తొలగించింది. దీంతో దాని​మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా ఇప్పటిదాకా దానిపై ఖర్చు పెట్టిన రూ.20 వేల కోట్లు గంగలో కలిపినట్టయింది. అసలు ఈ ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టాలనుకున్నారో చెప్పాలంటూ సీడబ్ల్యూసీ ఎన్నోసార్లు లేఖలు రాసినా, ఈ ప్రాజెక్టు వద్దని కాగ్ చెప్పినా వినకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా ముందుకుపోయింది.

 అంత ఖర్చు చేసినా ఆ మూడో టీఎంసీతో ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అంటే అదీ లేదు. అసలు రోజూ 2 టీఎంసీలు ఎత్తిపోసేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటిదాకా కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేని పరిస్థితి తలెత్తింది. మూడో టీఎంసీ కోసం మేడిగడ్డలో అదనంగా 6 మోటార్లు, అన్నారంలో 4, సుందిళ్లలో ఏర్పాటు చేసిన 5 అదనపు మోటార్లతో అసలు పనిలేకుండా పోయింది. అసలు ఆ ప్రాజెక్టునే ఇప్పుడు సీడబ్ల్యూసీ తన అప్రైజల్​ లిస్టు నుంచి తొలగించింది. దీంతో మళ్లీ డీపీఆర్ తయారు చేసి, కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో భూసేకరణ కొన్నేండ్లుగా  పెండింగ్​లో ఉంది.  

ఉన్న దానికే దిక్కులేదు..

వాస్తవానికి ప్రతి రోజూ 2 టీఎంసీలను ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ఏడు లింకులుగా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చేపట్టింది. 2019 జూన్ నెలలో ప్రాజెక్టును ప్రారంభించింది. 38 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పినా, కనీసం లక్ష ఎకరాలకు కూడా గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయారు. 2022లో వచ్చిన వరదలతో పంప్​హౌస్​లు మునిగిపోగా.. అప్పటి నుంచి నీటిని ఎత్తిపోసిన దాఖలాలు లేవు. పంప్​హౌస్​లలోని మోటార్లను రిపేర్లు చేసే సరికి..

Also Read :- బయట మనిషి చచ్చిపోతే లోపల సిన్మా చూస్తవా.?

 మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాజెక్టుపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సమస్య సీకెంట్​పైల్స్​తోనే ఉందని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) తేల్చి చెప్పిందని మంత్రి ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు ఆ బ్యారేజీకి పెట్టిన పైసలే వృథా అని అనుకుంటుంటే, మూడో టీఎంసీకి పెట్టిన డబ్బులు కూడా గంగలో పోసినట్టయింది. మొత్తంగా ఈ మూడో టీఎంసీకి పెట్టిన ఖర్చుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన రూ.లక్ష కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆయకట్టు లక్ష ఎకరాలు దాటట్లే..

రెండేండ్లుగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఒక్క చుక్కా ఎత్తిపోసింది లేదు. అంతకుముందూ ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చింది లేదు. కానీ లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్​నేతలు చెబుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా దాటడం లేదు. గోదావరి పరీవాహకంలో నీటి లోటు ఉంటుందని చెబుతున్న శ్రీరామ్​సాగర్​ప్రాజెక్ట్​(ఎస్సారెస్పీ) నుంచే ఆయకట్టుకు నీళ్లిస్తుండడం గమనార్హం. పోయినేడాది ఆ ప్రాజెక్టు నుంచే 11.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చారు. ఈ ఏడాది కూడా శ్రీరామ్​సాగర్​ప్రాజెక్ట్​ నుంచే ఆయకట్టుకు ఎక్కువ నీళ్లు ఇచ్చారు. ఖరీఫ్​లో 7.47 లక్షల ఎకరాలకు నీళ్లివ్వగా, యాసంగికి 7.99 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం నుంచి ఖరీఫ్​లో నీళ్లిచ్చిన ఆయకట్టు కేవలం 98,570 ఎకరాలే కావడం గమనార్హం. యాసంగి లక్ష్యంగా 93 వేల ఎకరాలే నిర్దేశించుకున్నారు. అయితే ఈ ఆయకట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు కాళేశ్వరం నుంచి కాక ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లతోనే ఇచ్చారు. ఇక, నిరుడైతే కాళేశ్వరం నుంచి ఇచ్చిన ఆయకట్టు కేవలం 74,200 ఎకరాలే.