- ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు
- తల్లికి ప్రతిరూపంగా ఉండాలన్నదే మేధావుల సూచన
- ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం కాదు
- దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది
- ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాం
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తల్లి అంటే విగ్రహం కాదని 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినం అని చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహమనేదే లేదని, ఇవాళ్టి నుంచి ఉండబోతోందని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకొందామని చెప్పారు.
తెలంగాణ తల్లి అటే వజ్రవైఢూర్యాలు, భుజకీర్తులు, కీరీటంతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారని సీఎం చెప్పారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం కాదని అన్నారు. తాము సిద్ధం చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దురదృష్ట వశాత్తూ కొందరికి నచ్చలేదని అన్నారు. మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతుందని చెప్పారు.
ALSO READ | పండగ చేస్కోండి : క్రిస్మస్ కు మూడు రోజులు హాలిడే ఇచ్చిన ప్రభుత్వం
ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ సాధన పోరాటంలో ఎందరో అమరులయ్యారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆనాడు సోనియాగాంధీ, ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9, 2009న యూపీఏ సర్కారు ప్రకటించిందని చెప్పారు. అందుకే డిసెంబర్ 9కి ప్రాధాన్యం ఉందని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ప్రారంభించిందని అన్నారు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలనే వాహనాలకు పెట్టుకునే పరిస్థితి కల్పించిందని చెప్పారు. జయయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని వివరించారు.
వివాదాలకు తావివ్వొద్దు
తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణకు వచ్చేలా.. బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నామని సీఎం చెప్పారు. నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నామని అన్నారు. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ‘దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది.. ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాం’అని సీఎం పిలుపునిచ్చారు.