రైతు రుణమాఫీతో దేశానికే తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్

హైద‌రాబాద్‌:  రెండు లక్షల రైతు రుణ‌మాఫీతో ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం దేశానికి, ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని సీఎం  రేవంత్ రెడ్డి అన్నారు. జ‌డ్పీటీసీ స‌భ్యునిగా, శాస‌నమండ‌లి స‌భ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్లమెంట్ లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప‌ని చేశాన‌ని తెలిపారు. త‌న 16 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఈ రోజు మ‌రుపురాని రోజ‌న్నారు.  రూ.2లక్షల రుణ‌మాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని  రాష్ట్ర స‌చివాల‌యంలోజూలై 18న  సాయంత్రం  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని 577 రైతు వేదికల్లోని అన్నదాతలు , రాష్ట్ర ప్రజలను  ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఆయా రైతు వేదిక‌ల వ‌ద్దనున్న రైతుల‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సీఎం మాట్లాడారు. అనంత‌రం మాట్లాడిన రేవంత్  2002, మే 6వ తేదీన వ‌రంగ‌ల్లో రాహుల్ గాంధీ రైతు డ్లిక‌రేష‌న్ ప్రకటించారని ఆనాడే రూ.2 లక్షల రుణ‌మాఫీకి హామీ ఇచ్చామ‌ని గుర్తు చేశారు. 

2023, సెప్టెంబ‌రు 17వ తేదీన కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఆరు గ్యారంటీల‌తో పాటు రైతు రుణ‌మాఫీ హామీ ఇచ్చార‌ని తెలిపారు రేవంత్. కాంగ్రెస్ అగ్ర నేత‌ల హామీ  ప్రకారం.. మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, అధికారుల‌ స‌హ‌కారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామ‌ని తెలిపారు.  కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణ‌మాఫీతో మరోసారి నిరూపణ అయింద‌న్నారు.  అర‌వై సంవ‌త్సరాల ప్రజల  ఆకాంక్షలను గుర్తించి 2004లో క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చార‌ని, ఎక్కువ ఎంపీ సీట్లున్న ఏపీలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని తెలిసినా ఇచ్చిన మాట మేర‌కు తెలంగాణ ఇచ్చార‌ని రేవంత్ గుర్తు చేశారు. 

మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చార‌ని కొనియాడారు. రైతుల అనుమ‌తితో తాను, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృత‌జ్ఞతలు తెలుపుతామ‌న్నారు. ఏ వ‌రంగ‌ల్ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో రుణ‌మాఫీ హామీ ఇచ్చామో అక్కడే  కృత‌జ్ఞత స‌భ పెడ‌తామ‌ని, ఆ స‌భ‌కు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర రైతుల త‌ర‌ఫున ఆయ‌న‌కు  కృత‌జ్ఞతలు తెలుపుతామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.