- చనిపోయిన పశువులకు రూ. 50 వేలు
- జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం
- తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తం
- తక్షణ సాయం కింద ఐదు వేల కోట్లు కావాలి
- ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాం
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,
- బండి సంజయ్ చొరవ చూపాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్/ సూర్యాపేట: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ సూర్యాపేట జిల్లా మోతెలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. చనిపోయిన పశువులకు రూ. 50 వేల చొప్పున, జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం అందిస్తామని వివరించారు. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా ఉంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్న అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. అధికారుల ముందు చూపు వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉందని అన్నారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలోని వరదల పరిస్థితిపై తనతో ఫోన్ లో చర్చించారని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇండ్లు కూలిపోయిన వారికి ప్రధానమంత్ర అవాస్ యోజన కింద కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని వివరించారు.
విపత్కర పరిస్థితిలో రాజకీయాలు వద్దు
విపత్కర పరిస్థితి లలో రాజకీయాలకు అతీతంగా కలిసి కట్టుగా పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు గతంలో వరదలు వచ్చినప్పుడెలా స్పందించారో అందరికీ తెలుసునని సీఎం అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇలాగే అబద్ధాలు చెబితే ప్రజలు వాళ్లకు నిజాలు చెప్పే సందర్భం వస్తుందని అన్నారు. బెయిల్ కోసం 20 మందితో ఢిల్లీ పోయేందుకు సమయం ఉంటుంది కానీ, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆదుకునే సమయం ఉండదా..? అని సీఎం ప్రశ్నించారు.
సీఎంఆర్ఎఫ్కు విరాళాలివ్వండి
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాయం అందించారని, అలాగే ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం నిబద్దతో బాధ్యతాయుతంగా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
100 మందితో టీజీడీఆర్ఎఫ్
వరదలు, ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్పై ఆధారపడకుండా తెలంగాణలో 100 మంది సభ్యులకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(టీజీడీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నామని సీఎం చెప్పారు. 8 బృందాలు ఈ పనిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఒక వ్యవస్థనే తీసుకు రానున్నట్టు వెల్లడించారు.
కేంద్ర మంత్రులు చొరవ చూపాలి
రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను పరిశీలించేందుకు రావాలని ప్రధానిని కోరినట్టు సీఎం చెప్పారు. రాష్ట్రానికి సాయం కింద రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానని అన్నారు. తక్షణ సహాయ సాయం కింద రూ.2వేల కోట్లు విడుదల చేసే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.