జనవరి నెలాఖరు కల్లా ఉస్మానియాకు శంకుస్థాపన

  • భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్
  • గోషామహల్ లో ఆ దిశగా చర్యలు చేపట్టండి
  •  అత్యాధునిక వసతులతో నిర్మించాలె
  •  గ్రీనరీ, పార్కు కూడా ఉండేలా చూడండి
  •  అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఈ నెలాఖరు కల్లా ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు.  కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఇవాళ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్ లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్ లలో పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా దవాఖాన నిర్మాణం ఉండాలన్నారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలన్నారు.  భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని చెప్పారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అత్యాధునిక వసతులతో నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు.