
- కృష్ణా జలాలపై చర్చకు రెడీ.. మాది తప్పయితే క్షమాపణ చెప్త
- తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్: సీఎం రేవంత్
- కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణశాసనం రాసిందే ఆయన
- జగన్‌ను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి నీళ్లు దోచిపెట్టిండు
- దగ్గరుండి పోతిరెడ్డిపాడుకు పెద్ద బొక్క పెట్టిచ్చిండు
- పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని
- అబద్ధాలకు జీఎస్టీ వేస్తేనైనా వాళ్లు దారిలోకి వస్తరేమో..
- ఆస్తులు బయటపడ్తాయనే ఆ ఫ్యామిలీ కులగణనలో పాల్గొనలేదు
- నేను 32 సార్లు ఢిల్లీకి పోయింది గోటీలు ఆడుకోనీకా?
- రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్త
- ఈ నెల 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తం
- అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్లను ఏపీకి కట్టబెట్టి, తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ నాయకులు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్‌రావు తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి మన రైతాంగానికి మరణ శాసనం రాశారని ఫైర్ అయ్యారు. ‘‘కృష్ణా జలాలపై చర్చకు మేం సిద్ధం. కేసీఆర్‌ను సభకు రమ్మనండి. ఆయన ఎప్పుడు వస్తే, అప్పుడే సభలో చర్చ పెడుదాం. కృష్ణా ప్రాజెక్టుల వివరాలన్నీ తీద్దాం. ఎవరి హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారు? అనేది చర్చిద్దాం.
ఈ చర్చలో మాది తప్పు అని తేలితే.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణలు చెబుతా” అని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తమకు స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘మాటకు ముందు స్టేచర్.. మాటకు వెనకాల స్టేచర్ అంటున్నారు. వాళ్లకు (బీఆర్ఎస్) స్టేచర్‌పై ఉన్న ఆలోచన.. స్టేట్ ఫ్యూచర్‌పై లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? ఎప్పుడూ మీ స్టేచర్ గురించేనా మీ తాపత్రయం?” అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ? ఏ ప్రమాదం? జరిగినా, ప్రజలకు నష్టం జరిగినా, పంటలు ఎండిపోయినా బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
నేనట్ల అనలేదు..
కేసీఆర్‌ను ఉద్దేశించి తాను మార్చురీ వ్యాఖ్యలు చేయలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘ఒకప్పుడు బీఆర్ఎస్‌కు అధికార పార్టీ స్టేచర్ఉండే. 2023 డిసెంబర్‌లో జనం ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్టేచర్ఇచ్చారు. 2024 జూన్‌లో గుండుసున్నా ఇచ్చి, ఆ పార్టీని మార్చురీకి పంపించారు. నేను అన్నదాంట్లో తప్పేముంది. నేను బీఆర్ఎస్ పార్టీని మార్చురీకి పంపించారని అంటే.. కేసీఆర్‌ను అన్నట్టుగా హరీశ్‌రావు, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు’’ అని మండిపడ్డారు. అంత కుంచిత స్వభావం తనకు లేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ అధికారం గుంజుకుని.. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఇంకేముంది ఆయన దగ్గర నేను తీసుకోవడానికి? ఆయన దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా. అది ఎవరికి కావాలి. అయితే హరీశ్‌రావుకు కావాలి.. లేదంటే కేటీఆర్‌కు కావాలి. కేసీఆర్‌కు ఏదైనా జరగాలని నేనేందుకు కోరుకుంటాను. నాకేందుకు తప్పుడు మాటలు ఆపాదిస్తారు. నేను అలా కోరుకోవడం లేదు. కేసీఆర్ వందేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. వారు అట్లనే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇట్లనే అధికారంలో ఉండాలి. వాళ్లు సూచనలు ఇస్తూనే ఉండాలి. నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి” అని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం కేసీఆర్ ఇంట్లోనే నలుగురు పోటీ పడుతున్నారని చెప్పారు. మాహేశ్వర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారని, ఈరోజు కాకపోతే రేపు అయినా అవుతారని పేర్కొన్నారు.
కృష్ణా జలాలాపై పోరాడుతున్నం..
తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిందే కేసీఆర్, హరీశ్‌రావు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులు ఉండే. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి సమక్షంలో.. వాళ్లు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లి 512 టీఎంసీలు ఏపీ వాడుకోవాలని, 299 టీఎంసీలు మా తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి వచ్చారు. ఈ ఒప్పందాన్ని పర్మనెంట్‌గా ఒప్పుకుంటున్నామని 2021–22లో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాశారు. ఇప్పుడు మేం వచ్చిన తర్వాత అవన్నీ పరిశీలించి, మనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నం. పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 70 శాతం, ఏపీకి 30 శాతం కేటాయింపులు ఉండాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. గతంలో చేసిన ఒప్పందాలన్నింటినీ తిరగరాయాల్సిందేనని పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మొదలు జలశక్తి మంత్రి దాకా అందరినీ కలిసి విన్నవించాం. న్యాయమైన వాటా కోసం కేఆర్ఎంబీ మొదలు సుప్రీంకోర్టు దాకా కొట్లాడినం. మేం ఇంత చేస్తుంటే, మీ (బీఆర్ఎస్) తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ఎదురుదాడికి దిగుతూ ఎన్ని రోజులు కాలం వెళ్లదీస్తరు” అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ వల్లనే తెలంగాణ ఏడారి..
రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టి, దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చిందే బీఆర్ఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘2004లో వైఎస్‌రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప ఇన్‌చార్జ్ మినిస్టర్‌గా నాయిని నర్సింహారెడ్డి ఉన్నది నిజం కాదా? హరీశ్‌రావు ఎమ్మెల్యే కాకున్నా రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా? ఆయన ఆశీర్వాదంతోనే కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయిన మాట నిజం కాదా? కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే 4 వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా? పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేస్తే తెలంగాణ శాశ్వతంగా ఏడారిగా మారుతుందని, దాన్ని అడ్డుకోవాల్సిందేనని పి.జనార్దన్‌రెడ్డి కొట్లాడింది నిజం కాదా? ఆనాడు రాజశేఖర్‌రెడ్డికి హారతులు ఇచ్చింది కేసీఆర్, హరీశ్‌రావు కాదా? నాయిని నర్సింహారెడ్డి, మీరు మన హక్కులను ఏపీకి తాకట్టు పెట్టి.. తెలంగాణను ఏడారిగా మార్చింది నిజం కాదా? నా పాలమూరును, నల్లగొండను, రంగారెడ్డి జిల్లాలను ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పొట్టన పెట్టుకున్నది మీరు కాదా? మీ నీతి.. జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని అనుకుంటున్నారా? ఆనాడు మేం లేమా ఈ సభల్లో.. ఎవరిని మభ్య పెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు” అని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.
కమీషన్ల కక్కుర్తితో పాలమూరుకు అన్యాయం..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు–రంగారెడ్డికి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చే అంశంపై మాట్లాడితే.. ఇదే సభలో చిన్నారెడ్డిని కేసీఆర్అవమానించిన మాట వాస్తవం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘కాంట్రాక్టులు, కమీషన్లకు కక్కుర్తిపడి జూరాలకు బదులు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించడంతో ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెరిగింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు బదులు 175 కిలోమీటర్లు కాల్వలు తవ్వాల్సి రావడంతో రూ.60 వేల కోట్లకు అంచనాలు పెరిగాయి. రెండు టీఎంసీలను ఒక్క టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈరోజు ప్రాజెక్టులు కట్టినా నీటిని తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా?. తుంగభద్ర, సుంకేసుల, కృష్ణా నది జలాలు కర్ణాటక నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపూర్, జూరాలకు వస్తాయి. వచ్చినవి వచ్చినట్టే ఒడిసిపట్టి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తరలిస్తే.. ఈనాడు పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి రాయలసీమకు ఏపీ తరలించుకుపోయే అవకాశం లేకపోతుండే” అని అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి మీరే కారణం..
రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 3 లక్షల ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని రూ.2 వేల కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రారంభించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 కిలోమీటర్లకు పైగా టన్నెల్ తవ్వితే... తెలంగాణ వచ్చిన తరువాత మిగిలిన 10 కిలోమీటర్లు తవ్వకుండా పదేండ్లు పక్కనపెట్టారు .శాశ్వతంగా నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌లో ముంచి, అక్కడి రైతుల చావులకు కారణమయ్యారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రూపాయి ఖర్చు లేకుండా 4 వేల క్యూసెక్కులు వస్తుండే. ఈరోజు జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, 8 మంది కార్మికుల చావుకు కారణం మీరు (బీఆర్ఎస్) కాదా?” అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రం వచ్చిన తరువాత పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయలేదు. 60 ఏండ్లు ఉమ్మడి ఏపీలో పూర్తికానీ ప్రాజెక్టులను 10 ఏండ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించి.. ఈ ప్రాంత రైతులకు మరణ శాసనం రాసింది కేసీఆర్కాదా? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తదనే.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ ప్రజల కష్టాలు తీరేవి” అని అన్నారు.
మీరు చేసిన తప్పులు, అప్పులకు ప్రజలు శిక్ష వేశారు..
బీఆర్ఎస్ చేసిన తప్పులకు ప్రజలు శిక్ష విధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలు ఓడించాలని చూసినా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు గుండు సున్నా ఇస్తే మాత్రం ప్రజలను తిడుతారా? మీరు చేసిన తప్పులకు, అప్పులకు ప్రజలు శిక్ష విధించారు” అని అన్నారు.
నాపైన కోపం ఎందుకుంటది?
15 నెలల్లో ఎంతో అభివృద్ధి సాధించినందుకు ప్రజలకు తనపైన కోపం ఉంటదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘నాపై ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటది? 15 నెలల్లో ఆడబిడ్డలు ఒక్క రూపాయి పెట్టకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకా? వెయ్యి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని చెప్పినందుకా ? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకా? ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినందుకా ? ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు ఇచ్చినందుకా ?” అని అన్నారు. ఏడాదిలోనే 50వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినందుకు నిరుద్యోగులకు తనపై కోపం ఉంటదా? అని ప్రశ్నించారు. 25.35 లక్షల మంది రైతులకు రూ. 20,615 కోట్ల రుణమాఫీ చేసినందుకు తనపై రైతులకు కోపం ఉంటదా? అని అడిగారు. నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు పేదలకు తనపై కోపం ఉంటదా? అని ప్రశ్నించారు. తనపై బీఆర్ఎస్ వాళ్లకు మాత్రం కోపం ఉంటదని, అధికారం కోల్పోయామనే దు:ఖంలో ఆ కోపం ఉంటదని చురకలంటించారు.
రాష్ట్రం కోసం ఇంకో 300 సార్లు ఢిల్లీకి పోతా
ఢిల్లీ పర్యటన పేరుతో తాను ఎలాంటి దుబారా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి గోటీలు అడుకోవడం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం పీఎంను, కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు. ఇప్పటికీ 32 సార్లు ఢిల్లీ వెళ్లానని, ఇంకో 300 సార్లయినా వెళ్తానని చెప్పారు. ఒకటి, రెండుసార్లు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ మినహా మిగతా ప్రతి సందర్భంలోనూ సాధారణ ప్యాసింజర్లు వెళ్లే ఫ్లైట్లలోనే వెళ్లానని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటివారని, ఆయన్ను తాను కలవడంలో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని, అందువల్ల కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని కలిశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ ఎస్ నేతలు నాడు గవర్నర్‌ను అవమానించారని, ఇప్పుడు కూడా అట్లనే వ్యవహరిస్తే అసెంబ్లీలోనూ సున్నా మిగుల్తదని సీఎం రేవంత్ అన్నారు.
హైదరాబాద్‌ను నాశనం చేసిన్రు..
కమీషన్లు తీసుకొని హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేశారని బీఆర్ఎస్ నేతలను సీఎం విమర్శించారు. చెరువులు, కుంటలు మాయం చేశారని అన్నారు. పదేండ్లలో నిర్మించిన అపార్ట్‌మెంట్లకు తగినట్లు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని తాము ప్రయత్నిస్తుంటే అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
టైమొచ్చినప్పుడు దుబాయ్ రికార్డు బయటపెడ్త
దుబాయ్‌లో ఫ్రెండ్ చనిపోతే అక్కడే అంత్యక్రియలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దుబాయ్ నుంచి అన్ని వివరాలు తెప్పించామని తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు బయట పెడతానని చెప్పారు. దుబాయ్ గుట్టు అంతా తన దగ్గర ఉందని పేర్కొన్నారు. దీపావళికి డ్రగ్స్ వాడే సంస్కృతి వాళ్లదని విమర్శించారు. కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లు, పార్టీలు ఇచ్చే దోస్తులు వాళ్లకు కావాలని అన్నారు.
మీరనుకునే పట్టు పరిస్థితి వస్తే..
తనకు పరిపాలన మీద పట్టు లేదంటున్నారని, పరిపాలన మీద పట్టు అంటే పాలసీలు తేవడమని, అభివృద్ధి చేయడమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈటలను, రాజయ్యను మంత్రి పదవుల నుంచి తీసేసినట్లు.. తప్పులు చేయని అధికారులను తొలగించడం కాదని పేర్కొన్నారు. వారన్న పట్టు వస్తే ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ ను బయటకు తీసుకురాగలమని స్పష్టం చేశారు. అట్లాంటి పట్టు గురించి ఆలోచన చేయడం లేదని, ఆ పరిస్థితి వస్తే ఫస్ట్ వాళ్లను తీసి లోపల ఏయాల్సి వస్తదని అన్నారు. లగచర్లలో కంపెనీలు పెడదాం అనుకుంటే కలెక్టర్‌ను కొట్టారని తెలిపారు. దాడి చేస్తే కేసులు పెట్టామని, ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టావంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ‘‘ఫామ్‌హౌస్‌లలో ఉండే మీకు రక్షణ కావాలి.. కానీ అధికారులను కాపాడొద్దా?’’ అని ప్రశ్నించారు.
మార్చి 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా..
‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇస్తున్నాం. సన్నవడ్లకు బోనస్ రూ.1,206 కోట్లు ఇచ్చాం. 260 లక్షల టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. కాళేశ్వరం కట్టడం.. కూలడం..రూ. లక్షకోట్లు ఆవిరి మూడేళ్లలో జరిగింది. కాళేశ్వరం లేకుండా ఒకే సీజన్‌లో కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలిచారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నగదు బదిలీ చేశాం” అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. మార్చి 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా జమచేస్తామని వెల్లడించారు.
అన్నం తింటున్నారా? అబద్ధాలు తింటున్నారా?
17న కులగణన, 18న ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని, అవి అసెంబ్లీ సమావేశాల అజెండాలో పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘వాటిని సభ షెడ్యూల్‌లో పెట్టలేదని హరీశ్ రావు, కేటీఆర్ చెప్పడం విడ్డూరం. వీళ్లు అన్నం తింటున్నారా? అబద్ధాలు తింటున్నారా? ఈ కుటుంబమంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? అబద్ధాలపై జీఎస్టీ లేదని ఏది పడితే అది మాట్లాడతారా? అబద్ధాలపై జీఎస్టీ వేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానికి సూచించాలి. అబద్ధాలపై జీఎస్టీ వేస్తే గానీ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అబద్ధాలు చెప్పడం మానదు” అని ఎద్దేవా చేశారు.
ఆస్తులు బయటపడ్తయనే కుల గణనలో పాల్గొనలే
దొంగ ఆస్తులు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కుల గణన సర్వే లో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులతో కుల గణన చేయించామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ఎవరితో చేయించారో కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. సర్వే తప్పు అంటే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు రావని అన్నారు. ఇదొక కుట్ర అని తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలు రాష్ట్రంలో ఉన్నదే 59 అని.. ఆ సొక్కమాయిన సర్వే చేస్తే 82 కులాలని తేలాయని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ కులాలను ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. నిజంగానే తెలంగాణ రక్తం కేసీఆర్‌లో ప్రవహించి ఉంటే ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ఎందుకు తీసుకురాలేదని, సెక్రటేరియెట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే దుఃఖం ఎందుకు వస్తున్నదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మీరు ఫామ్‌హౌస్‌లో ఉంటే.. సామాన్య రైతు కొట్లాడిండు..
కేసీఆర్ హయాంలోనే రాష్ట్రానికి కృష్ణా జలాల్లో శాశ్వతంగా అన్యాయం జరిగిందని, అవన్నీ లెక్కలతో సహా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్ 2020లో నాటి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిపించి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి ఏపీ నీళ్ల దోపిడీకి అనుమతి ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రికి ఓకే చెప్పారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌నుంచి 600 టీఎంసీలు తరలించుకు పోయేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తే.. కేసీఆర్ అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే సామాన్య రైతు ఎన్జీటీలో పిటిషన్ వేసి ఏపీ దోపిడీపై పోరా టం చేశారు. ఆ తర్వాత పాలమూరు రైతులు తిరగబడడంతో ఆ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇంప్లీడ్ అయింది” అని గుర్తు చేశారు.
బువ్వ పెట్టిన తెలంగాణకు అన్యాయం చేస్తవా?
రోజా దగ్గరకు వెళ్లి రొయ్యల పులుసు తిన్నది ఎవరు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘రోజా ఒక్కసారి రొయ్యల పులుసు పెడితే తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి వచ్చిన మహానుభావుడు కేసీఆర్. రోజా ఒక్కసారి పెట్టిన రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపించిన నువ్వు.. నిన్ను పెంచి, పోషించి, బుక్కెడు బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించిన తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తవా? నిన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే మా గుండెల మీద తన్నుతవా? మేం రాజకీయ భిక్ష పెడితే, మా పాలమూరు ఎండగొడుతావా? మా కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్పడావు పెడుతావా? ఇదేనా నీ నీతి .. జాతి” అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘‘ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి, ఇప్పుడు మా మీద నిందలు వేస్తరా? మీరున్నప్పుడే సాగర్ మీదకు సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చింది? తప్పులన్నీ చేసి, ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు సభను కూడా తప్పుదోవ పట్టిద్దామని అనుకుంటున్నారా?” అని మండిపడ్డారు.
ఇదేం పైశాచిక ఆనందం?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పదేండ్ల తరువాత ఎస్‌ఎల్‌బీసీ మొదలుపెడితే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు చనిపోయారు. ప్రమాదం జరిగితే సానుభూతి చూపించి, కుటుంబాలను పరామర్శించాలి. కానీ ఈ పైశాచిక ఆనందం ఏంటి? ఎవరు చనిపోయినా తండ్రీకొడుకు, మామా అల్లుడు కలిసి డ్యాన్సులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగినా, పంటలు ఎండిపో యినా, విద్యార్థులు, కార్మికులు చనిపోయినా, ఏదైనా పాఠశాలలో చిన్న సంఘటన జరిగినా ఆనంద పడుతున్నారు. మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆఫ్రికా అడవుల్లో మనుషు లను పీక్కు తినేవాళ్లు ఉంటారని విన్నాను. ఉగండా అధ్యక్షుడు ఈడీ అమీన్ మనుషులను కోసుకుని తినేటోడు అని సినిమాలో చూపిస్తే.. ఇట్ల కూడా ఉంటారా? అని ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వీళ్లు దాన్ని నిజం చేస్తున్నారు. పైశాచికత్వంలో ఈడీ అమీన్‌తో పోటీ పడుతున్నారు” అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ 2 సార్లు అసెంబ్లీకొచ్చి.. రూ. 57లక్షల జీతం తీసుకున్నడు
ఏడాదిన్నరలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే. కానీ శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత భత్యాలు రూ.57 లక్షల 84 వేల 124. డిసెంబర్ 2023 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు దాదాపు 15 నెలలుగా జీత భత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. ఆయన నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదు. ప్రజా సమస్యలను చట్ట సభల్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవు. - సీఎం రేవంత్