తెలంగాణ ప్రజలకు 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛ వచ్చింది : సీఎం రేవంత్

తెలంగాణ ప్రజలకు 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛ వచ్చింది : సీఎం రేవంత్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 2023 డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన  పదేళ్లల్లో రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ హరించివేశారని ఆయన అన్నారు. కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 

నాటి బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా విముక్తి చెందిందో.. అదే స్ఫూర్తితో, పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉంది. తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ద పాలన జరుగుతోంది. గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలకు పంద్రాగస్ట్ శుభాకాంక్షలు తెలిపారాయన.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. నెహ్రూ  హయాం నుంచే దేశ విజయ ప్రస్థానం మొదలైంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు ల హయంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని రేవంత్ అన్నారు. పీవీ నరసింహరావు గారి ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని గట్టెక్కించాయని చెప్పారు. 

మహానుభావుల త్యాగాలతో సాతంత్ర్యం సాధించాం.. మహాత్ముడి స్పూర్తితో ప్రజా పాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి విరించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రం విడుదల చేశాము. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ కు కోరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి.