- పార్టీలో కష్టపడ్డవారికి.. ప్రజల మధ్య ఉన్నోళ్లకే పదవులు
- జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి
- పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి
- సీఎల్పీ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం
- పీసీసీ చీఫ్ పదవిని బాధ్యతగా భావిస్తా: మహేశ్ కుమార్ గౌడ్
- లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి: దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 10 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.. ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ హోటల్లో రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉన్న వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు రేవంత్ సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నాయకులకు పదవులు ఇచ్చామని తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వారానికి రెండుసార్లు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యకర్తలను కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. 9 నెలల్లో సీఎంగా ఒక్క రోజు కూడా తాను సెలవు తీసుకోలేదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమలాగా కేవలం 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అని, ఆయన ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి, ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యత చేపట్టారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని, 8 లోక్ సభ సీట్లు కూడా గెలిచామని చెప్పారు. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నాడని రేవంత్ అన్నారు.
నిత్యం అందుబాటులో ఉంటా: మహేశ్ గౌడ్
పార్టీ తనకు ఇచ్చిన పదవిని ఒక బాధ్యతగా భావిస్తానని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్గౌడ్తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని భావిస్తున్నానని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తానని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రులపై ఉందన్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలు గెలవాలని అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తాను, సీఎం రేవంత్ ఇద్దరం సమన్వయంతో కలిసి పనిచేశామని చెప్పారు. కేసీఆర్ అబద్ధాలతో పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించారని, ఈ పదేండ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణం అని, ఆయన్ను ప్రధాని చేయడమే ధ్యేయంగా అందరం పనిచేయాలని పిలుపునిచ్చారు. మోదీకి భవిష్యత్తు లేదని, అందుకే కులం, మతంపేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సూచించారు.
పీసీసీ చీఫ్‌కు సన్మానం
దాదాపు 3 గంటలపాటు సాగిన సీఎల్పీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సన్మానించారు. మహేశ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించినందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్ర నేతలు సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తోపాటు పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, విష్ణునాథ్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, రేణుకా చౌదరి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ ఇతర నేతలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం వద్దకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలు వచ్చినా.. వారు మీటింగ్‌కు దూరంగానే ఉన్నారు.
మహేశ్ నాయకత్వంలో పార్టీ ముందుకు: మంత్రి ఉత్తమ్
పార్టీకి విధేయుడిగా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం శుభ పరిణామమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. మహేశ్ నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు.
సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయం: మంత్రి శ్రీధర్‌బాబు
పార్టీలో నేతలంతా సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎల్పీ మీటింగ్‌లో చర్చించుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్యులు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై చర్చించుకున్నామన్నారు. కాగా, శేర్ లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో సీఎల్పీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రావడంతో.. మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇక్కడకు వచ్చారన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు రాలేదని స్పష్టం చేశారు. సిద్దిపేటకు సీఎం రేవంత్ వెళ్తే.. ఆయన్ను కలిసేందుకు హరీశ్‌రావు వెళ్లడా? అని ప్రశ్నించారు.