డిసెంబర్ 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహం

డిసెంబర్ 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహం
  • పదేండ్లు పట్టించుకోనోళ్లు.. ఇప్పుడు మాట్లాడుతున్నరు : సీఎం రేవంత్
  • అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు  
  • సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాల్నా? లేక ఫామ్ హౌస్​లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాల్నా?
  • అక్కడ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ 
  • రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది
  • త్వరలోనే సెక్రటేరియెట్ ముందు విగ్రహం పెడతాం
  • మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెల్లడి
  • రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘2009 డిసెంబర్ 9న యూపీఏ చైర్ పర్సన్ హోదాలో సోనియా తెలంగాణపై ప్రకటన చేశారు. అదే రోజు ఆమె పుట్టిన రోజు. ఆ రోజున సెక్రటేరియెట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మేం బీఆర్ఎస్ వాళ్ల లెక్క తప్ప తాగి.. పొద్దున ఓ మాట, రాత్రి ఇంకో మాట మాట్లాడం. తాగి ఇచ్చిన మాట మరిచిపోయేవాళ్లం కాదు. పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టనోళ్లు.. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడితే.. తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది” అని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్ లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 


ప్రభుత్వం సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా, దానిపై బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై మండిపడ్డారు. ‘‘సెక్రటేరియెట్ ముందున్న అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాల్నా? లేక పొద్దున్నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాల్నా?. అక్కడ తాగుబోతు విగ్రహం పెడితే.. రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఈ సన్నాసి (కేటీఆర్) దుఖం, బాధ ఏమిటని నేను కనుక్కుంటే.. వాళ్ల అయ్య విగ్రహం పెట్టేందుకు అని తెల్సింది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘దేశంలో విద్య, సాగునీటి రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ప్రధాని నెహ్రూ మనుమడు, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ కుమారుడు, 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియమ్మ భర్త, ప్రధానిగా దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొన నేత, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నేత రాజీవ్ గాంధీ.. సెక్రటేరియెట్ వద్ద ఆయన విగ్రహం పెడితే రేపటి తరానికి స్ఫూర్తిదాతగా నిలుస్తారు” అని చెప్పారు. 

‘‘కొంతమంది సన్నాసులు ఇంకా విర్రవీగుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. ఆ బలుపును అణగదొక్కే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పుతెగుద్ది. రాజీవ్ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని తీసేందుకు నువ్వు (కేటీఆర్) ఎప్పుడు వస్తవో తేదీ చెప్పు.. ఆ బాధ్యత మా జగ్గన్న తీసుకుంటాడు. అక్కడ ఆయనే ఉంటాడు” అని హెచ్చరించారు. ‘‘తెలంగాణ ముసుగులో వేల కోట్లు దోచుకుని, వందల ఎకరాల భూములు గుంజుకుని, పొద్దంతా తాగే సన్నాసుల విగ్రహాలను పెడితే భావితరాలకు ఏం సమాధానం చెప్తాం. వాళ్లు ఇంకా అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు రాగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 7 సీట్లలో డిపాజిట్లు రాలేదు. 15 సీట్లలో మూడో స్థానంలో నిలిచారు. ఇక మీరు, మీ కుటుంబం చింతమడకకు పరిమితం కావాల్సిందే.. లేదంటే వీపు చింతపండు కావాల్సిందే” అని హెచ్చరించారు.  

యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తం.. 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత అని, త్వరలోనే సెక్రటేరియెట్ ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘1980వ దశకంలోనే దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది రాజీవ్ గాంధీనే. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు” అని కొనియాడారు. ‘‘సౌత్ కొరియాలోని స్పోర్ట్స్  యూనివర్సిటీలో శిక్షణ పొందిన క్రీడాకారులు 16 మందికి ఒలింపిక్స్ పతకాలు వచ్చాయి. అందుకే తెలంగాణలోనూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఒలింపిక్స్ లక్ష్యంగా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు. 

మీలెక్క గడీల్లో కూర్చుంటలేం: డిప్యూటీ సీఎం భట్టి  

విదేశాల్లో చదువుకున్నానని, ఐటీ మినిస్టర్ గా పని చేశానని చెప్పుకునే వ్యక్తికి హైదరాబాద్ లో ఐటీ విస్తరణకు కృషి చేసిందెవరో తెలియదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హైదరాబాద్​లో ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్ గాంధీనే అని, దాన్ని తాము మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ నేతలు ఆక్రమించిన భూములు, చెరువులు, కుంటలను హైడ్రా ద్వారా రక్షించి.. రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నాం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం. ధరణి అంటే ధనవంతుల కోసం అనేలా గత పాలకులు చేశారు. పదేండ్లలో రూ.లక్ష రుణమాఫీ చేసిన గత ప్రభుత్వం.. పది రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మా ప్రభుత్వాన్ని విమర్శించడమేంటి?” అని మండిపడ్డారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏదో కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని వచ్చారని గత పాలకులు ఆరోపిస్తున్నారు. ఎంవోయూలు చేసుకుంటేనే కంపెనీలు వస్తాయి. మేం వాళ్లలాగా గడీలు, కోటల్లో కూర్చొని స్వలాభం కోసం పని చేయడం లేదు” అని అన్నారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, కాంగ్రెస్​నేతలు జగ్గారెడ్డి, రోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గాంధీ భవన్ లో రాజీవ్ జయంతి.. 

గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మిస్టర్ క్లీన్ ప్రధానిగా రాజీవ్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. సద్భావన యాత్రను మొదలుపెట్టింది రాజీవ్ గాంధీనే అని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.  

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన.. 

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సెక్రటేరియెట్ ఆవరణలోని స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి  పరిశీలించారు. సోమాజిగూడలో రాజీవ్ జయంతి వేడుకల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్.. ఆ తర్వాత సెక్రటేరియెట్ కు చేరుకున్నారు. తన కాన్వాయ్ గేట్ దగ్గరికి రాగా అక్కడే దిగిన సీఎం... ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్య సలహాదారు వేం నరేందర్​రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు, సుందరీకరణపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను  ఆదేశించారు. ఆ తర్వాత సాయంత్రం మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సెక్రటేరియెట్ ఆవరణలో పరిశీలించారు.

సెక్రటేరియెట్ ముందున్న అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాల్నా? లేక పొద్దున్నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్​లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాల్నా?. అక్కడ తాగుబోతు విగ్రహం పెడితే.. రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఈ సన్నాసి (కేటీఆర్) దుఖం, బాధ ఏమిటని నేను కనుక్కుంటే.. వాళ్ల అయ్య విగ్రహం పెట్టేందుకు అని తెల్సింది. కొంతమంది సన్నాసులు ఇంకా విర్రవీగుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. ఆ బలుపును అణగదొక్కే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పుతెగుద్ది.  -  - సీఎం రేవంత్