వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్

వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్
  • శంషాబాద్​లో ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • ఎయిర్ పోర్టు పక్కన పెద్దాస్పత్రుల నిర్మాణం
  • అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి 
  • అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడ్తమని వెల్లడి
  • బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని దాదాపు వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే, అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం శనివారం ఆస్పత్రిలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పక్కన భూమి తీసుకుని పెద్దాస్పత్రులు నిర్మిస్తామని, అక్కడ మెడికల్ హబ్ ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కచ్చితంగా చోటు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ కు వస్తే జబ్బు నయమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామన్నారు.

‘‘ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24 ఏండ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషకరం. కేబినెట్​లో నిర్ణయం తీసుకుని ఆస్పత్రి లీజ్ వివాదాన్ని పరిష్కరించాం’’ అని ఆయన తెలిపారు.

‘‘పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన ఆలోచనా విధానాలను ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగించారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేసి, పేదలకు సేవలు అందించేలా తీర్చిదిద్దారు.

ఆస్పత్రిలో వైద్య సేవ లు అందుతున్న తీరు చూసి ఎన్టీఆర్ స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆస్పత్రి 25వ వార్షి కోత్సవానికి కూడా రావాలని నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. 30వ వార్షికోత్సవానికి కూడా నేనే సీఎం హోదాలో వస్తా” అని రేవంత్​ తెలిపారు. 

చంద్రబాబుతో పోటీ పడే చాన్స్.. 

అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం వచ్చిందని చెప్పారు. ‘‘గతంలో 12 గంటలు పని చేస్తే చాలు అని అనుకునేవాడిని. కానీ పక్కనున్న ఏపీ సీఎం చంద్రబాబు 18 గంటలు పని చేసే వ్యక్తి. అభివృద్ధి, సంక్షేమంలో ఆయనతో పోటీ పడే అవకాశం వచ్చింది.

ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే, మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలి. చంద్రబాబు ఏపీలో సీఎం కావడంతో నాతో సహా అధికారులంతా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.