హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందించే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన నిరుద్యోగులు ఆశించారు. కానీ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ఎల్బీ స్టేడియంలో 5,192 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..ఎల్బీ స్టేడియం చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచే ఇందిరమ్మ పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామంటున్నారు.. కానీ ఏ ఒక్క పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవన్నారు. రాబోయే రోజుల్లో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.