- కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత: సీఎం రేవంత్రెడ్డి
- వచ్చేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్
- భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తం
- లగచర్ల ఘటనలో కుట్రచేసినోళ్లను వదిలిపెట్టం
- అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తం
- కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కుట్రచేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు.
అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై సెక్రటేరియెట్లో సీఎంను కలిసి కమ్యూనిస్టు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
‘‘కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడ్త?” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని తెలిపారు.
కొడంగల్ లో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని వివరించారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కమ్యూనిస్టు నేతలు పశ్యపద్మ, రమ, ఎస్ఎల్ పద్మ, జానకి రాములు, గాదగోని రవి, ఎస్.వీరయ్య, జి. నాగయ్య తదితరులు ఉన్నారు.
నిర్వాసితుల పాలసీని మార్చాలి: కూనంనేని
లగచర్ల ఘటనలో అమాయకులైన గిరిజనులపై కేసులు ఎత్తివేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. సీఎంను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్లలో జరిగిన ఘటనను ప్రభుత్వం విచారణ చేపట్టవచ్చని, కానీ గిరిజనులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలన్నారు. దీనికి సీఎం కూడా అంగీకరించారని ఆయన తెలిపారు.
‘‘కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, అక్కడ ఇండస్ట్రీయల్ పార్కు అని సీఎం చెప్పారు. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని మమ్మల్ని కూడా ఆయన కోరారు” అని కూనంనేని వెల్లడించారు. ఫార్మా కంపెనీలను అవసరమైతే ఏడారి ప్రాంతాల్లో, ప్రజలకు నష్టం జరగని స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని వామపక్ష పార్టీలు సీఎంకు సూచించాయని వివరించారు.
ఒకవేళ ప్రభుత్వం జనావాసాల్లో ఫార్మాకంపెనీలను ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలుగా తాము అంగీకరించబోమని సీఎంకు చెప్పినట్లు వెల్లడించారు. ఏదైనా పరిశ్రమను ప్రభుత్వ మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవాలని, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే రైతులను స్వచ్ఛందంగా ఒప్పించి వారికి పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే వారి భూముల్లో ఏర్పాటు చేసుకోవాలని కూనంనేని సాంబశివరావు అన్నారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇప్పటి వరకు సెటిల్ కాలేదని తెలిపారు. ఈ సందర్భంగానైనా నిర్వాసితుల పాలసీని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. వారిని సంతోష పరిచేవిధంగా పరిహారం పెంచి ఇవ్వాలని, భూమికి బదులు అదే భూమి వేరే చోట అయినా ఇప్పిస్తేనే రైతులు ఒప్పుకుంటారని ఆయన తెలిపారు.
జ్యుడీషియల్ విచారణ చేయాలి: తమ్మినేని
లగచర్ల పరిధిలోని 4 గ్రామాల్లోని రైతులపై నిర్బంధకాండను నిలిపివేయాలని, పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలిపారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. లగచర్ల ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని అన్నారు.
రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ చేయొద్దని సూచించారు. తాము చేసిన సూచనలకు సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చర్యలను లగచర్లలో చేపట్టాలని తెలిపారు.
దీంతో పాటు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు, కార్మికుల కనీస వేతనాలు, రైతు భరోసా అమలు, గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయిలు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎంను కోరినట్లు వివరించారు.