
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ వెల్లడి
- కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నరు
- అలాంటి వారి గురించి నేను చర్చించదలచుకోలే
- ప్రజలపై పెత్తనం చేసుడు కాదు.. జనానికి ఏది అవసరమో అదే చేస్తున్నం
- సైనిక్, ఆర్మీ స్కూళ్లకు దీటుగా పోలీస్ స్కూల్
- త్వరలో ప్రభుత్వ ప్రీస్కూల్స్,ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామనిప్రకటన
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలపై పెత్తనం చేయడం కాదని.. వాళ్లకు, భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో అదే చేస్తున్నా మని ఆయన తెలిపారు. ‘‘రెండు రూపాయలకు కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీ ఆర్.. ఐటీ పేరు చెప్తే చంద్రబాబు.. జలయజ్ఞం పేరు చెప్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎట్ల గుర్తుకొస్తరో.. నా పేరు చెప్తే యంగ్‌ఇండియా గుర్తుకురావాలి. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్.. మహాత్మాగాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్’’ అని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధికే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ‘‘కొంతమంది కొన్ని రకాలుగా కొన్నికొన్ని బ్రాండ్స్ క్లైయిమ్ చేసుకుంటరు. ఉద్యమకారులమని.. తెలంగాణ ప్రదాతలమని చెప్పుకుంటరు.. అలాంటి వాళ్ల గురించి నేను పెద్దగా చర్చించదలచుకోలేదు” అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను గురువారం ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు. స్టూడెంట్లతో ముచ్చటించారు. వారితో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘పోలీస్ కుటుంబాలు, పోలీస్ శాఖతో నాకు అను బంధం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. సైనిక్, ఆర్మీ స్కూల్స్‌కు దీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలి. ఇందుకు కావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సీఎం తెలిపారు. పోలీస్ స్కూల్‌లో చదువుకున్నామని పిల్లలు గర్వంగా చెప్పుకునే విధంగా ఈ స్కూల్‌ను తీర్చిదిద్దాలన్నారు.
సీఎస్‌ఆర్ ఫండ్స్ సేకరించండి
సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలిపిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుది అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ‘‘నాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ సారథ్యంలో దేశంలోని గొప్పగొప్ప యూనివర్సిటీలకు పునాదులు పడ్డాయి. మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు సహా దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. అందులో కొంత మంది చరిత్రలో గుర్తుండిపోయారు. వారు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రను మలుపు తిప్పాయి” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా తాను అండగా ఉంటానని, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు నిధులు, అనుమతులు ఏం కావాలన్నా ఇబ్బంది రాదని చెప్పారు. ‘‘కేజీ నుంచి పీజీ వరకు మీ స్కూల్‌ను మీరు తీర్చిదిద్దుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఫార్మా, ఐటీ కంపెనీలకు రక్షణ కల్పిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ సంస్థలు కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఉంది. ఐటీ, ఫార్మా కంపెనీల నుంచి సీఎస్‌ఆర్ ఫండ్స్ సేకరించండి. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్లు కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీని, సీవీ ఆనంద్‌ను ఆదేశిస్తున్నా. ఇందుకు అవసరమైన పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు.
త్వరలోనే ప్రభుత్వ ప్రీ స్కూల్స్, ప్లేస్కూల్స్
ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ స్కూల్స్‌లో స్టూడెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని.. ప్రభుత్వ స్కూల్స్‌లో పిల్లల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వీటిలో18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటు మాత్రం 11,500 స్కూళ్లు ఉంటే 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యుత్తమ విద్యార్హతలు ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విధానంలోనే లోపం ఎక్కడుందో ఆలోచించాలి. లోపాలు గుర్తించేందుకు నిపుణులతో విద్యా కమిషన్ వేశాం. ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం లేనందున విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లు తేలింది. ప్రైవేట్‌లో మాదిరిగానే ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలకు ఎలాగైతే రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్రభుత్వ ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం” అని
వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రీస్కూల్స్, ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పోలీసు విధులు కత్తిమీదసాములాంటివని, ప్రజల ప్రశాంత జీవనం కోసం ఎన్నో త్యాగాలు చేసే పోలీసుల కోసం ఎంత చేసినా తక్కువేనని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను నిలిపేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
పోలీసు పిల్లలకు మంచి విద్య: డీజీపీ
పోలీసుల పిల్లలకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బూస్టింగ్ అవుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. రానున్న రోజుల్లో హోంగార్డు స్థాయి నుంచి ప్రతి పోలీస్ పిల్లలకు మంచి విద్య అందుతుందని పేర్కొన్నారు. పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్‌ను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి పోలీస్‌శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆయన అన్నారు.
ఓపెన్ కేటగిరీ ఫీజులపై త్వరలో నిర్ణయం: సీవీ ఆనంద్
హైదరాబాద్ సీపీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ స్కూల్‌లో రిజర్వ్ చేసిన 100 సీట్లకుగాను 82 మంది విద్యార్థులు, ఓపెన్ కేటగిరీలో 100 సీట్లకుగాను ఐదుగురు విద్యార్థులు చేరారని వివరించారు. 4,000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓపెన్ కేటగిరిలో ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఫీజుల తగ్గింపుపై నిర్ణయం తీసుకో నున్నట్టు పేర్కొన్నారు.
స్కిల్ వర్సిటీతో ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత
ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ సహా ఉన్నత చదువులు పూర్తి చేసి బయటకు వస్తున్నా రని.. కానీ, వారిలో నైపుణ్యత కొరవడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ‘‘స్కిల్ లేని యువ ఇంజ నీర్లకు ఐటీ కంపెనీలు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయని గమనించాం. అందుకే యువ తలో స్కిల్ పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీలో చేరే ప్రతి విద్యార్థికి ఉద్యోగభద్రత లభిస్తుంది” అని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ మొదలుపెట్టుకున్నా మని చెప్పారు. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలోనూ 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
మన క్రీడాకారులు నికత్ జరీన్, సిరాజ్‌ను డీఎస్పీలుగా నియమించామని గుర్తుచేశారు.
పోలీస్ స్కూల్‌కు పలువురి ఆర్థిక సాయం
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ క్యాప్‌లను చేతపట్టుకుని ఊపుతూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్కూల్‌కు సీఎస్‌ఆర్ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.30 లక్షలు, ఎస్పీ రెడ్డి
రూ.కోటి, జీజీఎస్ ఇంజనీరింగ్ కు చెందిన ప్రవీణ్ రెడ్డి రూ.50 లక్షలు, తేజస్వి డెవలపర్స్ కు చెందిన నిరంజన్ రూ.50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.