హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మత వివక్షకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మత కల్లోలాలు జరగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేర్చే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై క్రిస్టియన్లు వారి విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. పాస్టర్సతీశ్.. దేవుడి సేవలో 35 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహిమోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను రూపుమాపేందుకు ప్రభుత్వం వైపు నుంచి తమ వంతు కృషిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగా గంజాయి, డ్రగ్స్ పీడ విరగడ చేసేలా భక్తులకు సందేశం ఇవ్వాలని సతీశ్‌ను కోరారు. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయమన్నారు.