- బీజేపీని ప్రశ్నించినందుకే నాపై కేసులు.. నేను భయపడను: సీఎం రేవంత్
- రాజ్యాంగం ఉండాలన్నందుకు మోదీ, అమిత్ షా పగబట్టిన్రు
- గుజరాత్ ఆధిపత్యం, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు
- దేశంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ధీమా
- జగిత్యాల జిల్లా కోరుట్లలో జనజాతర సభ
జగిత్యాల, వెలుగు: మోదీ వెనుక ఈడీ, సీబీఐ, ఐటీ ఉంటే.. తన వెనుక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం, 50 లక్షల మంది యువకులు ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను జాగృతం చేస్తూ బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగతో తనపై ఢిల్లీ లో కేసు పెట్టారని అన్నారు. తాను కేసులకు భయపడబోనని తెలిపారు. గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని, భయాందోళనలకు గురి చేస్తూ రాజ్యాధికారం చేయాలని చూస్తే నిజాం నవాబులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జన జాతర సభకు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేస్తామంటే కుదరదని మోదీ, అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 18వ పార్లమెంటుకు భిన్నమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకోవడంలో పెద్ద కుట్ర దాగి ఉన్నదని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చిందని, వాటిని రద్దు చేసేందుకు జరుగుతున్న కుట్రను బహిర్గతం చేసినందుకు ఢిల్లీ పోలీసులను పంపి తనపై కేసులు పెట్టారని తెలిపారు. కేంద్ర హోం శాఖనే తనపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.
బీజేపీ సర్కారు తెలంగాణకు ఇచ్చిందేంటి?
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, గాడిద గుడ్డే ఇచ్చిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా విషయంలో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. ఐదేండ్లయినా తేలేదని అన్నారు. ఎంపీగా కవితకు అవకాశం ఇస్తే షుగర్ ఫ్యాక్టరీ మూసేశారని, అర్వింద్ కు చాన్స్ ఇస్తే హామీలు నెరవేర్చలేదని తెలిపారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు అంశాలను ప్రజలకు చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ రద్దు అంశాలను ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సభలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మినిస్టర్లు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి గెలిస్తే అభివృద్ధి..
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరిక మేరకు నిజామాబాద్ సీటును అధిష్టానం ఆయనకు కేటాయించిందని రేవంత్రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డిని లక్ష పైచిలుకు మెజార్టీ తో గెలిపించే బాధ్యత ప్రజలదేనని, లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు, మామిడి పరిశోధనా కేంద్రం, హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇక్కడ మాట్లాడితే అక్కడ కేసు పెడ్తరా?
తాను తెలంగాణలో మాట్లాడితే ఇక్కడ కేసు పెట్టకుండా ఢిల్లీలో ఎందుకు పెట్టారని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు తనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. దేశ ప్రధానిగా మోదీని గౌరవిస్తానని, కానీ గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తిడుతూ, శపించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో గత పదేండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు, అక్రమ అరెస్టులు, హత్యలు చేసి భయపెట్టాలని చూస్తే కేసీఆర్ ను ఇంటికి పంపించారన్నారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారా? కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రద్దు చేస్తారా?’ అని ప్రశ్నించారు. 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లు రద్దు చేసి.. దేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోందని ఆరోపిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడ్తామని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని, తెలంగాణ లో ఈ ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు.