హైదరాబాద్ తో పోటీపడేలా వరంగల్ అభివృద్ధి : రేవంత్ రెడ్డి

  •     ఓరుగల్లుపై ప్రత్యేక ఫోకస్ పెడతా
  •     స్మార్ట్​ సిటీ పనుల్లో వేగం పెంచండి
  •     ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హనుమకొండ/ వరంగల్, వెలుగు: 'ఓరుగల్లు డెవలప్ మెంట్ పై నేనే ప్రత్యేక ఫోకస్ పెడతా. హైదరాబాద్ తో పోటీ పడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తా' అని ముఖ్యమంతి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ నగర అభివృద్ధికి రూ.6,115 కోట్లు అవసరమని గుర్తించామని సీఎం వెల్లడించారు. ఇప్పడు ప్రాథమికంగా సమీక్ష నిర్వహించానని, 45 రోజుల తరువాత మళ్లీ వచ్చి పూర్తిస్థాయిలో రివ్యూ చేస్తానని స్పష్టం చేశారు. 

గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై రివ్యూ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఓరుగల్లు పట్టణానికి వచ్చారు. ముందుగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్ కు పార్కు చేరుకున్న ఆయన, అక్కడ మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. 

హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై 3 గంటల పాటు సమీక్షించారు. వరంగల్ అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రెండో రాజధానిగా వరంగల్ ను అభివృద్ధి చేసేందుకు జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ప్రణాళికలు రూపొందించాలని ఆఫీసర్లకు సూచించారు. ఆ తర్వాత హంటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన మెడికవర్​ ఆస్పత్రిని ప్రారంభించారు.

డీపీఆర్ రెడీ చేయండి..

మొదట రింగ్ రోడ్డు నిర్మాణంపై హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రెండు ఫేజ్ ల్లో 13 కిలో మీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేసి, పనులు చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగించాలని, వరదల నివారణకు హైదరాబాద్ లో చేపడుతున్న కొత్త పద్ధతులను ఇక్కడా అమలు చేయాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) నిర్మాణానికి డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. 

వరంగల్ అభివృద్ధికి 2050ని దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయాలని సూచించారు. వరంగల్ లో హైదరాబాద్ నిలోఫర్ లాంటి ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ చేపట్టాలన్నారు. సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి నాటికి కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. 

అత్యవసర సమయంలో ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలకు నిమ్స్ లో అందిస్తున్నట్లుగా ఎంజీఎంలో కూడా ఎన్వోసీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామని సీఎం ప్రకటించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్ లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం స్వశక్తి మహిళలకు రూ.518 కోట్ల 71 లక్షల 20వేల చెక్కును సీఎం అందజేశారు.

రాజకీయ బదిలీలు ఉండవు..

ప్రజలకు సుపరిపాలన అందిస్తామని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేయాలన్నారు. సమర్ధత ఆధారంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రేరేపిత బదిలీలు ఉండబోవని స్పష్టం చేశారు. 

వరంగల్ అభివృద్ధిపైనే  దృష్టి: ఇన్​చార్జి మంత్రి పొంగులేటి

వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి పెడతామని జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే మరోసారి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వరంగల్ సమగ్ర అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పర్యావరణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కుడా మాస్టర్ ప్లాన్ సరిగా లేదని, మళ్లీ కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని కబ్జాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్​అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాశ్​, ఎమ్మెల్యేలు రామచంద్రు నాయక్, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్విని,  తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.