పెద్దవాగు కరకట్ట పనులు ప్రారంభం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

పెద్దవాగు కరకట్ట పనులు ప్రారంభం :  ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  •    రూ.3.50 కోట్లు శాంక్షన్

 అశ్వారావుపేట, వెలుగు: పెద్దవాగు ప్రాజెక్ట్ తాత్కాలిక రిపేర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి రూ.3.50 కోట్లను శాంక్షన్ చేయించిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రాజెక్టు రిపేర్​పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతాంగాన్ని ఆదుకోవాలని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారన్నారు.

ఈ వానాకాలంలోనే రైతులకు2360 ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. పనులు వెంటనే పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తమ లక్ష్యమన్నారు. ఆయన వెంట నాయకులు జూపల్లి రమేశ్, చిన్నంశెట్టి సత్యనారాయణ, 
చెన్నారెడ్డి పాల్గొన్నారు.

ఇంటింటికీ సంక్షేమ పథకాలు

చండ్రుగొండ: సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో  ఆయన పర్యటించారు.

చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెం, మద్దుకూరు, చండ్రుగొండ, రావికంపాడు, దుబ్బతండా, పోకలగూడెం, రేల్లెవాడ, తుంగారం, తిప్పనపపల్లి గ్రామాలు, అన్నపురెడ్డిపల్లి మండలంలోని అబ్బుగూడెం, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి, పెంట్లం, ఊటుపల్లి గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్లు సంధ్యారాణి, జగదీశ్వరప్రసాద్, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.