- జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అందుకే: సీఎం రేవంత్‌రెడ్డి
- రిజర్వేషన్లను ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం
- గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిదీ ఇదే మాట
- సంఘ్ కార్యాచరణను అమలుచేస్తున్న బీజేపీ
- 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ల లక్ష్యం.. అందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నరు
- అదే క్రమంలో 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత
- 1978లో మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర
- ఆధారాలు నా దగ్గర ఉన్నయ్.. అవాస్తవమని బీజేపీ చెప్పగలదా?
- మోదీ కన్వర్టెడ్ బీసీ.. ఆయనకు బీసీలపై ప్రేమ లేదు
- నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులు
- కేసులకు భయపడ.. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై దాడి
- బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లే
- రిజర్వేషన్లు ఉండాలన్నా, వాటిని పెంచాలన్నాకాంగ్రెస్తోనే సాధ్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దాన్ని 2025 నాటికి అమలు చేయాలన్నదే బీజేపీ టార్గెట్ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాళ్ల కుట్రలను బయటపెట్టినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇది తనపై దాడి కాదని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై జరుగుతున్న దాడి అని తెలిపారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు సపోర్టు చేసినట్లేనని.. రిజర్వేషన్లు ఉండాలన్నా, వాటిని పెంచాలన్నా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజలకు ఆయన సూచించారు.
రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 2000లోనే వాజ్‌పేయి సర్కార్ జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. 400 ఎంపీ సీట్లు బీజేపీ అడగడం వెనుక, ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆ పార్టీ కూల్చడం వెనుక కూడా రిజర్వేషన్ల రద్దు అంశం దాగి ఉందని సీఎం అన్నారు. లోక్‌సభలో టు బై థర్డ్ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయడం ఈజీ అవుతుందని.. ఆ తర్వాత 50 శాతం రాష్ట్రాలు ఆమోదిస్తే చట్టంగా మారుతుందని.. అందులో భాగంగానే ‘అబ్కీ బార్ 400 పార్’ అనే నినాదం ఎత్తుకున్నారని, ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చేసిన కామెంట్ల క్లిప్పింగ్స్‌ను, 2000లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన గెజిట్‌ను మీడియా ముందు ఉంచారు. ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని, వీటిని తప్పని బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్, అనంతకుమార్ హెగ్డే వరకు అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ కుట్రలను తాను బయటపెడ్తుంటే ఎక్కడ ఎన్నికల్లో ఇబ్బందవుతుందోనని ఆ పార్టీ తనపై దాడి చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సిద్ధించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. దాని కోసం ఎన్నుకున్న రాజకీయ కార్యాచరణ పేరు బీజేపీ. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనుకోవడమే వాళ్ల ఎజెండా. దీనిపై నేను చాలా సార్లు మాట్లాడిన. ఇది దేశ స్థాయిలో చర్చకు రావడంతో ఎన్నికల్లో దెబ్బ తగులతదని భావించి బీజేపీ శాయశక్తులా నాపై దాడికి ప్రయత్నిస్తున్నది.
అందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి.. నా మీద అక్రమ కేసులు పెట్టింది. సూటిగా ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అడుగుతున్న.. నేను ఆధారాలతో ఆరోపణలు చేస్తుంటే అవి అవాస్తవమని ఎందుకు చెప్తలే?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేస్తుంటే.. వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి, సవరించుకోవాల్సింది పోయి ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, సీబీఐని వినియోగించినట్లు ఢిల్లీ పోలీసులను నాపై ప్రయోగిస్తున్నరు. ఈ ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణ సమాజం భయపడ్తదనుకుంటున్నరేమో.. అలాంటిదేమీ ఉండదు. రిజర్వేషన్లను కాపాడటానికి, బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలిచ్చిన బాధ్యతను ఉపయోగిస్త” అని స్పష్టం చేశారు.
వాజ్‌పేయి హయాంలోనే గెజిట్
2000లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆధ్వర్యంలో జరిగిన బడ్జెట్ ఉభయ సభల సమావేశాల్లోనే రాజ్యాంగం మార్పు అంశాన్ని స్పీచ్‌లో ప్రస్తావించారని, అనంతరం గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను సైతం అపాయింట్ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘2000 ఫిబ్రవరి 22న బీజేపీ నేతృత్వంలో ఉన్న నాటి ఎన్డీయే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పష్టంగా ఉభయసభలను ఉద్దేశించి ఆ నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగం తర్వాత తాము కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది.
రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడానికి ఇదే ప్రధాన ఆధారం. జస్టిస్ వెంకటాచలయ్య చైర్మన్‌గా, పది మంది సభ్యులుగా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేం సవరించాలని 2002లో కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ నివేదికను దాచిపెట్టుకొని, అందులోని అంశాలను రహస్య ఎజెండాగా మార్చుకొని ఇప్పుడు లోక్‌సభలో టు బై థర్డ్ మెజారిటీ వస్తే అమలు చేయాలనుకుంటున్నరు. ఆ కుట్రను నేను బయటపెట్టిన” అని అన్నారు. ‘షైనింగ్ ఇండియా’ నినాదంతో 2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎన్నికలకు వెళ్తే ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను అధికారంలోకి తెచ్చారని.. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలన్న, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ కుట్ర నుంచి ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు.
గోల్వాల్కర్ నుంచి హెగ్డే దాకా..
ఆర్ఎస్ఎస్ మూలాలున్నవాళ్లు, ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్లు కూడా ఎన్నో సందర్భాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వాటి క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపించారు. ‘‘ఆర్ఎస్ఎస్ రెండో సత్సంగ్ చాలక్ మాధవ్ సదాశివరావ్ గోల్వాల్కర్.. 1960లో రెండు పుస్తకాలు రాశారు. దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలని వాటిలో ఆయన స్పష్టంగా రాశారు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన రాశారు.
దురదృష్టకరం అని ఆయన పేర్కొనడం ఏమిటి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ ఎన్జీ వైద్య 2015 ఆగస్టు 30న (నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి) ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఏ కులాలు వెనుకబడి లేవు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా 10ఏండ్లు కొనసాగించి రద్దు చేయాలి’ అని అన్నారు. 2015లో ఆయన ఆ మాటలు అంటే.. 2025 నాటికి పదేండ్లు అవుతుంది. ఆయన మాటలను పదేండ్లు అంటే 2025 నాటికి అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నది”అని తెలిపారు. ‘‘2017లో మోదీ కేబినెట్లోని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే.. ‘రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది. రానున్న రోజుల్లో అది మారనుంది. నేను ఇక్కడున్నది అందుకే. దానికోసమే వచ్చాను’ అని స్టేట్మెంట్ ఇచ్చారు.
రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు” అని సీఎం తెలిపారు. మోదీ హయాంలోనే అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారని అన్నారు. ‘‘సుమిత్రా మహాజన్ కూడా ఓ సందర్భంలో.. ‘రిజర్వేషన్లు అభివృద్ధిని తీసుకువస్తాయా? కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అవి పదేండ్లు ఉండాల్సి ఉన్నా.. వాటిని ప్రభుత్వాలు పదేండ్ల కోసారి పెంచుకుంటూ వస్తున్నాయి. అవి దేశాన్ని అభివృద్ధి పరుస్తాయా’ అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆమె మాట్లాడారు” అని వివరించారు. 2017లో ఆర్ఎస్ఎస్ నేత వైద్య కూడా.. కుల ప్రాతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లు తొలగించాల్సిందేనన్నారని సీఎం చెప్పారు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన వాళ్లు చెప్పిన మాటలేనని.. ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. వీటిపై మోదీ, అమిత్ షా ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసిన్రు
బలహీన వర్గాల ప్రజల స్థితిగతులు తెలుసుకొని రిజర్వేషన్లు కల్పించేందుకు 1978లో బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పడిందని.. 1990లో కమిషన్ నివేదిక ఇచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘దేశంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నదని, వాళ్లకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ రికమండ్ చేసింది. ఆ రికమండేషన్స్‌ను వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేస్తున్నమంటే.. ‘కమండల్’ పేరిట ఎల్ కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు” అని వివరించారు.
నాడు రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్తే.. రిజర్వేషన్లు న్యాయసమ్మతమైనవేనని, కొనసాగించాలని తొమ్మిది మంది సభ్యులతో కూడి ధర్మాసనం చెప్పిందని ఆయన తెలిపారు. ‘‘బలహీనవర్గాల జనాభాను లెక్కించాలని, రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించొద్దని కోర్టు చెప్పింది. 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇంకో 27శాతం బీసీలకు ఇస్తే 50శాతంలోపే అవుతుందని, అంతకు మించొద్దని కోర్టు సూచించింది. ఈ 50 శాతం పరిమితిని తొలగించాలంటే దేశంలోని బీసీల జనాభాను మొత్తం లెక్కించాలని ఇంద్రసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది” అని ఆయన వివరించారు.
రాహుల్ యాత్రలోనివినతుల ఆధారంగా నిర్ణయం
రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారని, తమ రిజర్వేషన్లు కూడా పెంచి రాజ్యాంగ భద్రత కల్పించాలని జోడో యాత్ర సందర్భంలో రాహుల్‌గాంధీకి దేశవ్యాప్తంగా బలహీనవర్గాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అందుకు రాహుల్‌గాంధీ ఏకీభవించి, ఎక్కడ అధికారంలోకి వచ్చినా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి నిబంధనను తొలగించి పెంచాలన్న నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కుల గణన కోసం తాము కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, అసెంబ్లీలో కూడా చర్చించి గవర్నమెంట్ నిధులు కూడా ఇచ్చామని తెలిపారు. ‘‘బలహీనవర్గాల కోసం రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకుంటే వెంటనే బీజేపీ అప్రమత్తమై.. తాము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను పెంచి కొనసాగించాలనుకోవడం ఏమిటని కుట్ర పన్నింది. అందుకే ‘అబ్కీ బార్ 400 పార్’ అని నినాదం అందుకుంది. అట్ల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయొచ్చని భావిస్తున్నది” అని ఆయన పేర్కొన్నారు.
400 సీట్ల వెనుక రిజర్వేషన్ల రద్దు కుట్ర
400 ఎంపీ సీట్లను బీజేపీ అడగడం వెనుక కుట్ర దాగి ఉందని రేవంత్ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలంటే లోక్‌సభలో టు బై థర్డ్ మెజారిటీ కావాలి.. 50 శాతానికిపైగా రాష్ట్రాలు శాసనసభల్లో కూడా ఆమోదించాలి. 400 సీట్లు వస్తే.. టు బై థర్డ్తోటి లోక్‌సభలో చట్టం చేస్తరు. ఇదే క్రమంలో 8 రాష్ట్రా ల్లోని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. లోక్‌సభలో ఆమోదం పొంది.. రాష్ట్రాల్లోని అసెంబ్లీలోనూ ఆమోదం కోసమే ఇదంతా చేస్తున్నది” అని మండిపడ్డారు.
బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును సమర్థించినట్లే
బీజేపీకి వేసే ప్రతి ఒక్క ఓటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడ్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలంటే.. రాజ్యాంగం సమూల మార్పులకు గురికావాలంటే.. ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలుగాలంటే మీరు బీజేపీకి ఓటు వేయండి. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేస్తున్నట్టే. రిజర్వేషన్లు ఉండాలంటే, రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే ఎన్డీయే కూటమి ఓ వైపు... రాజ్యాంగాన్ని ఉంచి, రిజర్వేషన్లు పెంచడానికి నిర్ణయం తీసుకునే ఇండియా కూటమి మరోవైపు.. ఏది కావాలో జనం నిర్ణయించుకోవాలి” అని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అంశాలు పక్కకు పోయాయని, రాజ్యాంగం అంశం ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయని రేవంత్ చెప్పారు.
మీ కేసులకు బెదరను
కేసులకు తాను బెదిరే ప్రసక్తి లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మోదీ, అమిత్‌షా.. మీరు పెద్ద పెద్ద పదవులు చేసిన్రు.. మీరు పెద్దవాళ్లు కావొచ్చు. మీ ముందు నేను చాలా చిన్నవాడినే అయి ఉండొచ్చు. మీ పోలీసులతో నన్ను బెదిరించాలనుకుంటే మాత్రం అది జరగని పని. కావాలంటే ఈ రాష్ట్రంలో ఒకాయన(కేసీఆర్‌ను ఉద్దేశించి) ఉంటడు.. ఫ్రీగా ఉంటడు.. ఆయనను అడగండి.. అప్పట్లో నన్ను బెదిరించాలని ఆయన అనుకుంటే మేం ఎట్ల పోరాడినమో చెప్తడు. ఆయన పార్టీకి మీ పార్టీకి చీకటి ఒప్పందం కూడా ఉంది కదా. వెళ్లి అడగండి” అని పేర్కొన్నారు.
ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లే లేవని, ముస్లింలకు ఇచ్చింది బీసీ –ఈ కింద అని అన్నారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లనేవి అపోహ. ప్రజలను తప్పుదోవపట్టించి, ఎమోషన్స్‌ను వాడుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నరు. ఫేక్ వీడియోలు అంటూ కిషన్‌రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నడు. సీఎం ఎవరైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తరా? ఫేక్ వీడియోలు తయారు చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను అందరి ముందు ఓపెన్‌గానే చెప్తున్న. ఈస్టిండియా కంపెనీలాగా అదానీ, ప్రధాని సూరత్ నుంచే బయలుదేరి దేశాన్ని తమ కబంధహస్తాల్లో పెట్టుకోవాలనుకుంటున్నరు. కార్పొరేట్ సెక్టార్ కోసమే రిజర్వేషన్లు రద్దుకు కుట్ర చేస్తున్నరు” అని అన్నారు.
మోదీ చేస్తున్న దాడి తన మీద కాదని.. తెలంగాణ దళితులు, గిరిజనులకు, బీసీలపై దాడి అని తెలిపారు. వాట్సాప్ యూనివర్సిటీలో మోదీ వైస్ చాన్స్‌లర్ అని, అమిత్ షా రిజిస్ట్రార్ అని, ఆ పార్టీలోని మిగితా వాళ్లు స్టూడెంట్లు అని దుయ్యబట్టారు. ‘‘బీసీ లీడర్ని అని మోదీ చెప్పుకుంటున్నరు. ఆయన ఆర్టిఫిషియల్ బీసీ, కన్వర్టెడ్ బీసీ. సీఎం కాకముందు వాళ్లు ఫార్వర్డ్ క్యాస్ట్. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయినంక వాళ్ల సామాజికవర్గాన్ని బీసీలో కల్పిన్రు. మోదీకి బీసీల పట్ల ప్రేమ లేదు. ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తడు.. అంతే” అని విమర్శించారు. ‘‘పాకిస్తాన్‌తో కలిసి తనను హత్య చేయడానికి మన్మోహన్సింగ్ కుట్ర పన్నారంటూ 2019లో మోదీ చెప్పిండు. ఇంతకంటే పచ్చి అబద్ధం భూ ప్రపంచంలో ఉంటదా?” అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
మహిళా అడ్వకేట్‌తో హార్ష్‌గా ప్రవర్తించిన్రు
1925లో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ అప్పట్లోనే రిజర్వేషన్ల రద్దు వంటి పలు గోల్స్ పెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఆ గోల్స్‌లో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం.. రిజర్వేషన్లు తొలగించడం ఉన్నాయి. వీటితోపాటు 370 ఆర్టికల్రద్దు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫాం సివిల్ కోడ్ ఉండగా.. ఇప్పటికే వీటిని మోదీ, అమిత్ షా 17వ లోక్‌సభలో పూర్తి చేశారు. 18వ లోక్‌సభలో అంటే 2025 నాటికి రిజర్వేషన్లు రద్దు గోల్‌ను కూడా పూర్తి చేయాలని ప్రణాళికలు చేపట్టిన్రు. దీన్ని నేను ప్రస్తావించినందుకు నా మీద కేసు పెట్టిన్రు.
ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెడ్తే.. ముఖ్యమంత్రినైన నన్ను బాధ్యుడ్ని చేసి కేసు పెట్టిన్రు. ఫిర్యాదు చేసింది.. మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్(ఎంహెచ్ఏ). గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాపై కేసు పెట్టి.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి.. దేశ భద్రతకు ముప్పు వచ్చినట్లు ఇప్పటికిప్పుడు నన్ను రమ్మంటూ ఆదేశాలు ఇచ్చిన్రు. మా తరఫున పోలీసు స్టేషన్లో మహిళా అడ్వకేట్ వెళ్తే అక్కడి మేల్ పోలీసులు హార్ష్‌గా ప్రవర్తించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలోనే పనిచేస్తరు.. అందుకే నాపై దాడికి వాళ్లను ఎంచుకున్నరు. ఆ పోలీసులను ప్రయోగించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకోవాలని చూస్తున్నరు” అని ఆయన మండిపడ్డారు.
గెజిట్, కమిషన్, స్టేట్మెంట్లపై మోదీ, అమిత్ షా వైఖరేంది?
రాజ్యాంగానికి 50 ఏండ్లు పూర్తయిందని, మార్పులు చేయాలనుకుంటున్నామని వాజ్‌పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు. దీనిపై మోదీ, అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘జస్టిస్ వెంకటాచలయ్య నివేదికను ఏం చేశారు? 2014 తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్లు మొదలుపెడితే నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నరు. దీనిపై మీ విధానమేంది? ” అని ఆయన ప్రశ్నించారు.
‘‘వాజ్‌పేయి హయాంలో తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను నేను ప్రపంచం ముందు చర్చకు పెడ్తున్న. బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం. ఇది నా కోసమో, నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలోని 144 కోట్ల మంది ప్రజల కోసం పడుతున్న తాపత్రయం. రిజర్వేషన్లు రద్దు చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వంద శాతం నష్టమే” అని అన్నారు.