
- ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది
- అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటం
- శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఈ విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రక్షాళన జరగకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవాళ్లమవుతాం. చదువు ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో, పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ స్కూల్లో చదివిన నాకు బాగా తెలుసు. అవసరమైతే భవిష్యత్‌లోనూ విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకుంటా’’ అని చెప్పారు. విద్యా విధానంపై బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
త్వరలో విద్యావిధానంలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తామని.. దీనికోసం అన్ని పార్టీలు, మేధావులతో చర్చిస్తామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇస్తే.. అందరి సూచనలు, సలహాలతో ఒక పాలసీ డాక్యుమెంట్ రూపొందిస్తామని, దానిపై కూడా చర్చ పెడదామని, తర్వాత ప్రక్షాళన చేద్దామన్నారు. ‘‘మన విద్యా ప్రమాణాలు పడిపోవడంపై కేవలం ప్రభుత్వమే కాదు.. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలి’’ అని కోరారు. విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రక్షాళన మొదలుపెడ్తామంటే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. రాజకీయ కోణంలో ఆలోచన చేసినన్ని రోజులు ప్రక్షాళన చేయలేమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షలు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 వేల మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 36 వేల మంది టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి చేశామని చెప్పారు. ‘‘ప్రభుత్వ విద్యావిధానం వల్ల విద్యార్థులు వారి సబ్జెక్టుల్లో నిష్ణాతులు కాలేదని తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత తగ్గింది. 2014 నుంచి 2024 వరకు 6.50 లక్షల మంది స్టూడెంట్స్ మధ్యలోనే చదువు మానేశారు. ప్రతి స్టూడెంట్‌కు రూ. లక్ష ఖర్చు చేసినా ఇంతగా ప్రమాణాలు పడిపోవడం దారుణం” అని ఆయన అన్నారు.
30 తర్వాత ర్యాంకుల్లో ఉన్నం
2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగిందని.. ఈ సర్వేలో మూడు, ఐదో తరగతి చదివేవారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో కూడా కనీస ప్రాథమిక సామర్థ్యం చూపలేదనే విషయం తేలిందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘సబ్జెక్టులవారీగా దేశంలో 37 ర్యాంకుల్లో తెలంగాణ ఏ స్థానంలో ఉందో గమనిస్తే.. మూడో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 36, గణితంలో 35, ఈవీఎస్ లో 36 వ ర్యాంకులో ఉంది. ఐదో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 36, గణితంలో 35, ఈవీఎస్‌లో 36వ ర్యాంకులో ఉంది. మూడో తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగినవారు 2018లో 18.1 శాతం కాగా.. 2022లో 5.2 శాతం, 2024లో 6.3 శాతమే ఉన్నారు. 5వ తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు 2018లో 43.6 శాతం, 2022 లో 31.7 శాతం, 2024 లో 31.5 శాతమే. 3వ తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు 2018 లో 34.5 శాతం, 2022 లో 28.7 శాతం, 2024 లో 31.10 మాత్రమే. 5వ తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు 2018లో 48.7 శాతం, 2022 లో 44.6 శాతం, 2024 లో 41.1 శాతమే. ఇదీ పరిస్థితి” అని ఆందోళన వ్యక్తం చేశారు.
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తం
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు అంబేద్కర్ పేరు తీసేసి జైపాల్‌రెడ్డి పేరు ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ‘‘పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతలకు గతంలో ఏ పేరూ లేదు. అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టాం. హైదరాబాద్ కు మెట్రో రావడంలో జైపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ మెట్రోకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టినా తప్పులేదు. ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన జైపాల్‌రెడ్డి చేసిన సేవలు మరువలేం. ఆయన పేరును పాలమూరు ఎత్తిపోతలకు పెట్టుకోవడం సహేతుకమే’’ అని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలవడం లేదని కవిత ప్రశ్నించగా.. ‘‘గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31లోగా 12 వాయిదాల్లో చెల్లిస్తాం. కొందరు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రిటైరైన వారు చేసిన అప్పులు చెల్లించే బాధ్యత మాదే” అని సీఎం బదులిచ్చారు.
ఎక్కువ శాతం మందికి స్కిల్స్లేవు
రాష్ట్రంలో ప్రతి ఏడాది 1.10 లక్షల మంది స్టూడెంట్స్యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ ఎక్కువ శాతం మందిలో నైపుణ్యం కొరవడిందని సీఎం అన్నారు. ‘‘ఎంతో మంది ఇంజనీర్ కోర్సులు పూర్తి చేస్తున్నా.. వారికి ఉద్యోగాలు రావట్లేదు. వీటిన్నింటిని పరిశీలిస్తే వారికి బేసిక్స్కిల్స్లేకపోవడం, స్కిల్స్అప్డేషన్లేకపోవడం ప్రధాన కారణమని తెలుస్తున్నది’’ అని చెప్పారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టామని, ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ కు సంబంధించి విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. 2028 ఒలింపిక్స్గోల్డ్మెడల్సాధించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తా మని.. క్రికెట్లో సిరాజ్, బాక్సింగ్ఛాంపియన్నిఖత్జరీన్ప్రతిభకు మెచ్చి గ్రూప్1 ఉద్యోగం, ఇంటి స్థలం, క్యాష్ప్రైజ్ఇచ్చామని వివరించారు. క్రీడలపై తెలంగాణ స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ట్రైనర్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఆస్ట్రేలియాతో ఎంవోయూ కుదుర్చుకున్నామని చెప్పారు. కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి చెప్పి వంద నియోజకవర్గాల్లో వంద ఏటీసీలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రస్తుతమున్న 65 ఐటీఐలతో పాటు అడ్వా న్సుడ్ టెక్నాలజీతో మరో 35 ఐటీఐలను రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో 14 శాతం తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. మల్లేపల్లిలో త్వరలో నాలుగు ఐటీఐలను, రాష్ట్రవ్యాప్తంగా వంద ఏటీసీలను ప్రారంభిస్తామన్నారు. ‘‘విద్యాశాఖ పై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సమూలమైన మార్పులు తేవాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను సీఎం అయ్యాక విద్యా రంగంలో ప్రత్యేక విధానం తేవాలని నిర్ణయించామన్నారు. అందు కే విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ముందు సభలో చర్చ పెడతామని.. సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు పోతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.