కక్ష సాధింపులు ఉండవ్​.. రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం: సీఎం రేవంత్​రెడ్డి

కక్ష సాధింపులు ఉండవ్​.. రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం: సీఎం రేవంత్​రెడ్డి
  •    అహంకారం వల్లే కేసీఆర్​ ఓడిపోయిండు
  •     హరీశ్​ ట్రాప్​లో పడకుండా ఆయన అసెంబ్లీకి రావాలి
  •     డ్రగ్స్​ చెకింగ్​ కోసం సిగ్నల్స్​ వద్ద పోలీస్​ డాగ్స్ 
  •     మీడియాతో చిట్​చాట్​లో వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: అహంకారం, అతి తెలివితేటల వల్ల కేసీఆర్​ ఓడిపోయారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ ను ఓడిస్తానని చెప్పాను... అన్నట్లుగా ఓడించాను. బీఆర్​ఎస్​ను జీరో చేస్తానని చెప్పాను... లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ జీరోకు చేరింది” అని తెలిపారు. కక్షసాధింపు ఆలోచనలు తనకు లేవని, రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నామని అన్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి గురువారం దాదాపు 3 గంటల పాటు తెలుగు మీడియాతో చిట్​ చాట్​ చేశారు. కేసీఆర్​ను ఓడించాలని, సీఎం కావాలని కోరిక ఉండేదని.. ఆ రెండు కోరికలు తీరాయని.. ఇకపై రాష్ట్ర అభివృద్ది మాత్రమే తన లక్ష్యమని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయన్నారు. కలిసొస్తే కాంగ్రెస్ కు12 లేదంటే 9 సీట్లు గెలుస్తామని ఎన్నికల ముందు చెప్పానని పేర్కొన్నారు. 

మహబూబ్ నగర్ లో 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. ‘‘కేసీఆర్ తాను ఆత్మహత్య చేసుకొని బీజేపీని గెలిపించిండు. రాష్ట్రంలో ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. బీఆర్ఎస్ ఓడితే ఓడొచ్చు కానీ.. డిపాజిట్ కోల్పోయేంత వీక్ కాదు కాదా? ఈ విషయాన్ని పరిశీలిస్తే ఏం జరిగిందో అర్థమవుతది” అని ఆయన తెలిపారు. కేడర్ ఉంటే పార్టీ ఉంటుందని, పార్టీ కోసం పని చేసినవాళ్లకు మంచి పదవి వస్తుందన్న నమ్మకాన్ని కలిగించడమే తన ఉద్దేశం అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అందుకే పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లకు కాకుండా.. పార్టీ కోసం శ్రమించిన వాళ్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

కక్షసాధింపులతో పురోగతికి దెబ్బ

గత ప్రభుత్వ వైఫల్యాలపై శాఖల వారీగా ఎంక్వైరీలకు ఆదేశిస్తూ పోతే.. పెద్ద పెద్ద కంపెనీలు కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని సీఎం అన్నారు. కక్షసాధింపు చర్యలు ఉండవని, దానితో రాష్ట్ర పురోగతికి ఆటంకమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై  చట్టప్రకారమే ముందుకు వెళ్తామని, పాలనపైనే తన ఫోకస్​ ఉంటుందని అన్నారు.  ‘‘అధికారం అనేది ప్రజలు మనం పగ తీసుకోవడానికి ఇవ్వరు. మన కోపం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోకూడదు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు కోరుకోరు” అని పేర్కొన్నారు. చంద్రబాబు ఫోన్‌‌ చేస్తే హైదరాబాద్‌‌ లో జగన్‌‌ ఇంటివద్ద కూల్చివేతలు జరిపించారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుది అలా దిగజారే వ్యక్తిత్వం కాదని, ఆయన  45 ఏండ్ల రాజకీయ జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయలేదని అన్నారు. ఎవరు కూల్చేశారనే విషయం జగన్ కు బాగా తెలుసని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా కొనసాగాలని తానే సీడబ్ల్యూసీలో ప్రపోజల్ పెట్టానని, ఆ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్​ అన్నారు.  

పోలీస్​ వ్యవస్థకు మచ్చ తెస్తే సహించేది లేదు

అవినీతి, డ్రగ్స్, క్రైం ను కంట్రోల్​ చేసేందుకు తమ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అందుకే ఏసీబీ, విజిలెన్స్, నార్కోటిక్స్, ఇతర శాఖలను బలోపేతం చేశామని, రోజుకు నాలుగు చొప్పున అవినీతి తిమింగలాలు పట్టుబడుతున్నాయని ఆయన అన్నారు. బడా హోటల్స్ ముసుగులో కుళ్లిన ఆహారాన్ని ఇస్తున్న హోటల్స్ పై దాడులు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో అక్కడ మాత్రమే రాత్రి 11 తర్వాత షాపులు క్లోజ్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. హోం శాఖ తన కంట్రోల్ లోనే ఉందని అన్నారు. సీసీఎస్ లో అవినీతిని కంట్రోల్ చేసేలా ఏసీపీని తప్పించామని, పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేవాళ్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన ఐదేండ్ల పాలన ఫార్మర్మెన్స్ ను ప్రోగ్రెస్ కార్డుగా వచ్చే ఎన్నికల్లో కోట్లాడుతానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఈ దిశలో రాష్ట్ర అభివృద్ధి పైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేతప్ప పోటీ బీఆర్ఎస్ తోనా, బీజేపీతోనా అనే అంశాన్ని ఆలోచించడం లేదన్నారు. తాజాగా బీజేపీ మోదీ ఫేస్ తో ఎలక్షన్స్ కు వెళ్లిందని, వచ్చే ఎన్నికల టైమ్​కు మోదీ ఫేస్​తో వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్​ ఫోకస్​ను డైవర్ట్​ చేస్తున్న హరీశ్

కేసీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ విషయంలో హరీశ్​రావు ఏమీ చేయలేరని సీఎం రేవంత్​ అన్నారు.  ఒకవేళ ఏమైనా చేసినా.. సమాజం అంగీకరించదని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ ఫోకస్ ను హరీశ్​ డైవర్ట్ చేస్తున్నడు. హరీశ్​ ట్రాప్​లో పడకుండా.. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్​ కూర్చొని, ప్రజల్లో ఉంటే పరిస్థితులు మారవచ్చు. కానీ, ఆ పని చేయకుండా హరీశ్​ అడ్డుపడుతున్నడు. కేసీఆర్  అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే హరీశ్​ డమ్మీ అయితడు.. కేసీఆర్ లేకపోతే సభలో మాట్లాడేది హరీశ్​ మాత్రమే. ఏపీలో జగన్ ఎన్ని అవమానాలకు గురిచేసినా నాడు చంద్రబాబు ప్రతిపక్ష హోదాను వదిలిపెట్టలేదు. కేసీఆర్ సభకు వచ్చినా, మేము మాత్రం ఏపీలో మాదిరిగా కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి ఉండదు. హుందాగా ఉంటాం” అని అన్నారు. 

తెలంగాణ భవన్ నిర్మాణం స్టార్ హోటల్​కు!

ఢిల్లీలోని పటౌడి హౌస్​ వద్ద ఐదున్నర ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. హైదరాబాద్  హౌస్​ను ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలంలో గవర్నర్, సీఎం, మంత్రులు బస చేసేలా నిర్మాణాలు ఉంటాయని అన్నారు. తెలంగాణ భవన్  నిర్మాణాన్ని ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ కు అప్పగించేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ విధానంతో వేగంగా ఈ భవన్‌‌  నిర్మాణంతో పాటు నాణ్యమైన వసతి సౌకర్యాలు లభిస్తాయని అన్నారు. 

త్వరలో సిగ్నల్స్ వద్ద పోలీస్ డాగ్స్

డ్రగ్స్ ను అంతం చేసే దిశలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థను తయారు చేసినట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ. 100 కోట్లతో 50 ప్రత్యేక వాహనాలు, 31 పోలీస్ డాగ్స్, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. రాత్రి వరకు నడిచే బార్ లలో  ఇద్దరు పోలీసులతో ఒక డాగ్ వెళ్తుందని అన్నారు. ఎవరిపైనైనా డాగ్ అనుమానం వ్యక్తం చేస్తే... ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై సిగ్నల్స్ దగ్గర ఈ డాగ్స్​ను ఉంచనున్నట్లు చెప్పారు.

వాహనాలు ఆగగానే... ఈ డాగ్స్ వాహనాలను స్మెల్ చూస్తాయని... డాగ్స్ ఆగిన వాహనాలను టీమ్​లు చెక్​ చేస్తాయని అన్నారు. అన్ని శాఖలను కంట్రోల్ రూంకు కనెక్ట్ చేసి... కేవలం మూడు జోన్లుగా రాష్ట్రాన్ని తయారు చేస్తామని తెలిపారు. ఇన్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, గ్రామీణ తెలంగాణగా అభివృద్ధిని విస్తరించబోతున్నట్లు చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు ను అభివృద్ధి రేఖగా మార్చుకొని ముందుకు సాగుతామన్నారు. సిగ్నల్స్ లేకుండా ముందుకు సాగేలా అంతర్జాతీయంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ కంపెనీలతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.