- మోదీ పదేండ్లలో తెలంగాణకు ఇచ్చిందేం లేదు: సీఎం రేవంత్
- బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్
- బీసీ కులగణనను మోదీ వ్యతిరేకిస్తున్నరు
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
- ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటరు
- ఇన్నాళ్లు కేసీఆర్ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంట్
- జమ్మికుంట, రేగొండలో జనజాతర సభలు
కరీంనగర్/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గుజరాత్‌కు బంగారు గుడ్డు ఇచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పదేండ్లలో రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేం లేదని, బీజేపీ ఎంపీలు తెచ్చిందేం లేదని మండిపడ్డారు. మోదీ మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు. అందుకే 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ కోరుతున్నదని అన్నారు. ‘‘బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఆ పార్టీకి వస్తుంది. గతంలో నోట్ల రద్దు, వ్యవసాయ నల్ల చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఎలాగైతే పార్లమెంట్లో ఆమోదించారో.. అట్లనే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయి” అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. బీజేపీ వాళ్లు మాత్రం రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా జమ్మికుంట డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ కరీంనగర్ కు ఇచ్చిందేం లేదని, సంజయ్ తెచ్చిందేం లేదని విమర్శించారు. ‘‘తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాకర్టీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పునర్విభజన చట్టంలో సోనియాగాంధీ చేర్చారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను అమలు చేయకపోగా.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ లో మోదీ మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను, తెలంగాణ తల్లిని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆయన అవమానించారు” అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించినా మౌనంగా ఎందుకు ఉన్నారని సంజయ్ ని ప్రశ్నించారు. ‘‘ఈ ఐదేండ్లలో నిజామాబాద్ గుండు గానీ, కరీంనగర్ అరగుండు గానీ తెచ్చిందేమీ లేదు. కర్నాటకకు ఖాళీ చెంబు ఇచ్చిన మోదీ.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు” అని అన్నారు.
కల్యాణం కాకముందే అక్షింతల పంపిణీ..
శ్రీరాముడిని బీజేపీ అవమానించిందని రేవంత్ అన్నారు. ‘‘మొన్న అయోధ్యలో రాముడి కల్యాణం జరగకముందే అక్షింతలు పంచి శ్రీరాముడిని బీజేపీ అవమానించింది. ఇక్కడి బియ్యంలో పసుపు కలిపి అక్షింతలని పంచారు. హిందూ సంప్రదాయాలను ఆచరించే పెద్దలందరూ ఆలోచించాలె. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. మనందరం రాముడి భక్తులం కాదా? శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి చేయలేదా? ఈ దేశంలో మనకంటే ఎక్కువ హిందువులు ఉన్నరా?” అని ప్రశ్నించారు.
తామంతా హిందువులమేనని, కానీ ఓట్ల కోసం హిందుత్వాన్ని వ్యాపార వస్తువుగా వాడుకోబోమని చెప్పారు. ‘‘దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. కానీ గుండు, అరగుండు బజార్లు, బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు” అని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం..
కారు కార్ఖానాకు పోయిందని, ఇక తిరిగి రాదని రేవంత్ అన్నారు. ‘‘ఇయ్యాల కారుకు గతి లేదు కాబట్టే.. కేసీఆర్ బస్సులో తిరుగుతున్నడు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే.. ఎక్కడానికి, దిగడానికే సమయం సరిపోయిందన్నట్టుగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంది” అని విమర్శించారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. అందుకే పాలమూరు, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీకి వదిలేశారు. ఖమ్మం, నల్గొండ, మెదక్ లాంటి చోట్ల బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ సహకరిస్తున్నది” అని ఆరోపించారు.
‘‘12 సీట్లు ఇస్తే హంగ్ వస్తుందని, నామా మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారు. కానీ కేసీఆర్ ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. వారి కుట్రలను పసిగట్టే సీపీఐ, సీపీఎం, టీజేఎస్ మాకు మద్దతుగా నిలబడ్డాయి” అని తెలిపారు. సభల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు
బీసీ కులగణన వద్దంటున్న మోదీ..
బీసీ కులగణనను మోదీ వ్యతిరేకిస్తున్నారని రేవంత్ అన్నారు. ‘‘నెహ్రూ, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగాల్లో దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించారు. వీటి వల్లే అనేక మంది డాక్టర్లు, లాయర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం ఎస్టీ కోటాలో మంత్రిగా పని చేస్తున్నారు. బీసీ జనాభాను లెక్క గట్టి, జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు పెంచాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పారు. నేను సీఎం కాగానే బీసీ కులగణనకు అసెంబ్లీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు.
బీసీ జనాభాను లెక్కించాలని కాంగ్రెస్ అంటోంది. కానీ బీజేపీ నాయకులు, మోదీ మాత్రం బీసీల లెక్కలను తీయొద్దంటున్నారు” అని మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నా.. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ సొంత గ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్ గా మార్చలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం” అని చెప్పారు.
ఫైనల్స్ లోనూ గెలవాలి..
సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించామని, ఇప్పుడు ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలని రేవంత్ అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తల బాధ్యత తీరలేదు. మీ బాధ్యత ఇంకా మిగిలే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు మనకు సెమీ ఫైనల్స్ వంటివి. ఆ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినం. ఇప్పుడు జరగబోయే లోక్ సభ ఎన్నికలు ఫైనల్స్. ఈ ఎన్నికల్లో మోదీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి’’ అని కోరారు. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్నానని, పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని తెలిపారు.
మోదీ దిగజారి మాట్లాడుతున్నడు: పొన్నం
ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. ‘‘కరీంనగర్ లో నేను చేసిన అభివృద్ధే ఉన్నది. ఆ తర్వాత వచ్చిన వినోద్ కుమార్, బండి సంజయ్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. గ్రామాలకు పోతే సమస్యల గురించి అడగకుండా రాముడి ఫొటో వచ్చిందా? అక్షింతలు వచ్చాయా? అని అడుగుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే బండి సంజయ్ ని ఇంటికి పంపాలి” అని కోరారు.
గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా?
వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై నేను మాట్లాడితే.. వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ, విజిలెన్స్, పోలీసులను పంపి నన్ను వేధించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ ఇప్పుడు ఆయన నడుం విరిగి మూలకుపడ్డారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు. అందుకే ఆయన గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపించారు. నన్ను అరెస్టు చేయాలని వాళ్లను ఆదేశించారు. బీజేపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు.. సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకో.. భయపడేది లేదు. -
సీఎం రేవంత్ రెడ్డి