జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి

జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
  • మార్చి 31లోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్
  • మొదటి ఏడాదిలోనే 55 వేల జాబ్స్ ఇచ్చాం
  • సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలా సహకారం
  • ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందజేసిన సీఎం రేవంత్​
  • సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ‘రాజీవ్‌‌‌‌గాంధీ సివిల్స్‌‌‌‌ అభయహస్తం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ‘‘గత పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో 14 ఏండ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. కానీ మేం అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ను మార్చి 31లోగా పూర్తి చేస్తాం” అని వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు. 

ఇది ప్రోత్సాహకం.. 

సివిల్స్‌‌‌‌లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘సివిల్స్‌‌‌‌లో అత్యధికంగా బిహార్ అభ్యర్థులు రాణిస్తున్నారు. అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని, అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందజేస్తున్నాం. ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇస్తున్నాం. ఇది ఆర్థిక సాయం కాదు.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలి.

 సివిల్స్‌‌‌‌ ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సివిల్స్‌‌‌‌లో తెలంగాణ అభ్యర్థులే ఎక్కువ మంది ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం చేరుకోవాలి” అని అన్నారు. ‘‘హైదరాబాద్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ సిటీగా ఎదుగుతున్నది. తెలంగాణలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నది. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

సింగరేణిలో గ్రీన్ పవర్ ఉత్పత్తి: భట్టి 

రాష్ట్ర యువతను సివిల్స్ వైపు మళ్లించేందుకు సింగరేణి పక్షాన ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్ అభ్యర్థులు మధ్యలో ఆగిపోకూడదు. అభ్యర్థులను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం. సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తాం” అని ప్రకటించారు. సింగరేణి సంస్థ తెలంగాణకు తలమానికమని, దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘‘గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. 

మేం సింగరేణిని ప్రపంచ స్థాయి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నాం. సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంప్డ్​స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు ప్రపంచమంతా గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి, ఆ గనులు మూతపడే అవకాశం ఉంది. అందుకే ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సింగరేణికి గనుల తవ్వకంలో వందేండ్ల అనుభవం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లిథియం, గ్రాఫైట్ వంటి గనుల తవ్వకాల వైపు సింగరేణిని ప్రోత్సహిస్తాం. ఇందుకుగాను నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటాం” అని తెలిపారు. సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు.