చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా?: సీఎం రేవంత్​రెడ్డి

చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా?: సీఎం రేవంత్​రెడ్డి
  • మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతకు కొందరు అడ్డుపడ్తున్నరు
  • అలాంటి  వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు
  • ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్లు, ఆఫీసులు, పార్లమెంట్​ను మూసే పరిస్థితి వచ్చింది
  • ఆ పరిస్థితి హైదరాబాద్​కు రావొద్దంటే  మూసీ ప్రక్షాళన కీలకం
  • రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలుగువాళ్లు సహకరించాలని పిలుపు 
  • జపాన్‌‌లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం వల్ల స్కూళ్లు, ఆఫీసులు, పార్లమెంట్‌‌ను కూడా మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయని.. దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకావాల్సిన అవసరం లేదా? అని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌‌ను కాలుష్య నగరంగా మారనివ్వొద్దని, ఇందుకు అందరి సహకారం కావాలని కోరారు. ‘‘మూసీ ప్రక్షాళన, నాలాలపై ఆక్రమణల తొలగింపు, చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వంటి చర్యలకు కొంతమంది అడ్డుపడ్తున్నరు. అలాంటి ఆక్రమణలను కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఆలోచించండి. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు పర్యావరణ పరిరక్షణ కోసమే. హైదరాబాద్​ను పొల్యూషన్​ ఫ్రీ సిటీగా మార్చుకుందాం. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యాన్ని వారసత్వంగా అందిద్దాం” అని పిలుపునిచ్చారు. 

శనివారం జపాన్‌‌‌‌‌‌‌‌లోని టోక్యోలో ‘జపాన్​ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని.. ఇందుకు ప్రతి ఒక్కరూ చేతనైనంత సహకారం అందించాలని ఆయన సూచించారు. 

రాష్ట్రాభివృద్ధిలో మూసీ ప్రక్షాళన కీలకం

రాష్ట్ర అభివృద్ధిలో మూసీ నది ప్రక్షాళన కీలకమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో సబర్మతి, వారణాసిలో గంగా, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ల స్ఫూర్తితో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. చెరువు మధ్యలో ఉన్న నిర్మాణాలను చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. వాటిని కూల్చకపోతే ప్రకృతి క్షమించదన్నారు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో హడ్సన్, లండన్‌‌‌‌‌‌‌‌లో థేమ్స్, సియోల్‌‌‌‌‌‌‌‌లోని నదులను స్వయంగా చూసిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలంటే  మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చాలని తెలిపారు.

ప్రవాసుల సహకారం కావాలి

మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి  చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, సాంకేతిక నైపుణ్యం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందన్నారు. యువత పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాష్ట్ర పురోగతి కోసం ప్రవాస తెలుగువాళ్లు సహకారం అందించాలని ఆయన కోరారు.

 ‘‘తెలంగాణను, హైదరాబాద్​ను  ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్‌‌‌‌‌‌‌‌తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగువాళ్ల సహకారం, ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైంది” అని ఆయన తెలిపారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైతో కాకుండా.. న్యూయార్క్, టోక్యో, లండన్ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్​కు పోటీ ఉండాలని, ఈ లక్ష్య సాధన కోసం టోక్యో వంటి నగరాల నుంచి గొప్ప నిర్వహణ పద్ధతులు నేర్చుకుంటున్నామని చెప్పారు.

 ప్రవాస తెలుగువాళ్లు తమ ఆలోచనలు, అనుభవాలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని.. సొంత ఊరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ లాక్ రాష్ట్రం కావడంతో ఓడరేవు లేని లోటును అధిగమించేందుకు మచిలీపట్నం వద్ద డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. దానికి డెడికేటెడ్ జాతీయ రహదారి, రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేస్తే, ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్​ 
వెల్లడించారు. 

హైదరాబాద్​ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్‌‌తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగువాళ్ల సహకారం, ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైంది.

- సీఎం రేవంత్​ రెడ్డి