బీఆర్ఎస్ పదేళ్లలో సంపూర్ణంగా చేయలేని రుణమాఫీని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో కాలంలో కేవలం 27 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో 20 వేల 616 కోట్లు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసాపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో కాళేశ్వరం కట్టి కూళేశ్వరంగా మార్చడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని భూములకు 21 వేల కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో 16 వేల కోట్లు రుణమాఫీ చేశారని, లక్ష మిత్తి ఉంటతే 80 వేలు మిత్తీలకే సరిపోయిందని అన్నారు. రెండో సారి 11 వేల 909 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. ఐదేళ్లలో నికరంగా చేసిన రుణమాఫీ 3384 కోట్లు మాత్రమేనని అన్నారు. ఓఆర్ఆర్ అమ్మి రెండో విడత రుణమాఫీ డబ్బులు ఇచ్చారని తెలిపారు.
పదేళ్లలో అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ 27 వేల కోట్లు చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 27 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కేవలం 27 రోజులలో 17 వేల కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఏడాదిలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 20 వేల 616 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు.