
- ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏడు, బీజేపీ పది సీట్లలో పోటీ చేస్తయ్: సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌పై కేంద్రం ఒక్క కేసైనా ఎందుకు పెట్టలే?
- సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ దగ్గరే ఉన్నా ఇన్నాళ్లూ ఎందుకు స్పందించలే?
- దోపిడీలో వాటా కోసం తప్ప చర్యలు తీసుకోవాలన్న ఆలోచన బీజేపీకి లేదు
- త్వరలో జ్యుడీషియల్ ఎంక్వైరీని కేసీఆర్అండ్ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిందే
- ఈ నెల 27న ప్రియాంక సమక్షంలో 500కు గ్యాస్, ఫ్రీ కరెంట్ స్కీమ్‌లు ప్రారంభిస్తామని ప్రకటన
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి పొత్తులు ఉన్నాయని, త్వరలోనే బయటపెడ్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఏడు, బీజేపీ పది సీట్ల చొప్పున పంచుకొని పోటీలో ఉండబోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్నా.. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు విచారణ జరిపించలేదని, కనీసం ఒక్క కేసైనా పెట్టారా? అని ప్రశ్నించారు.
మేడారం మహా జాతరకు శుక్రవారం సీఎం రేవంత్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లుగా ఏనాడూ ప్రధాని మోదీ అడ్డుకోలేదు. మేడిగడ్డపై ఇప్పుడు మేము జ్యుడీషియల్ విచారణకు అనుమతి ఇవ్వగానే.. సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నరు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ నేతలు.. కేసీఆర్, కేటీఆర్ చేసిన దోపిడీ, అక్రమాలపై ఒక్క కేసైనా పెట్టిన్రా?” అని సీఎం నిలదీశారు.
సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఇన్నాళ్లూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ‘‘మేము ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ అవినీతిపై ఇచ్చిన నివేదికలను కేంద్రం పట్టించుకోలేదు.. ఇప్పుడెందుకు సీబీఐకి అప్పగించాలని అంటున్నరు? ఇదే విషయాన్ని ఒక బీజేపీ నేతతో అంటే.. ‘అట్ల అప్పగిస్తే మేం కొంచెం గిల్లుకోవచ్చు కదా’ అని అన్నడు. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే తప్ప చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదు” అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులుత్వరలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జిల ఆధ్వర్యంలో సాగే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం తేల్చిచెప్పారు.
27 నుంచి ఫ్రీ కరెంట్, రూ.500కే సిలిండర్
రాష్ట్రంలో ఉన్న ఒక్కో చిక్కుముడి విప్పుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రతిహామీని అమలు చేస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పబోతున్నామని అన్నారు. ఈ నెల 27న 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని వెల్లడించారు.
60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 60 రోజుల్లోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని ఎలాగైతే ప్రజలకు హామీ ఇచ్చామో దానికి తగినట్లుగానే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వీటిని ప్రజలకు కనిపించేలా.. కుళ్లుకుంటున్న వాళ్లకు వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలోనే వేలాది మంది సమక్షంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని సీఎం చెప్పారు.
6,956 మంది స్టాఫ్ నర్సులు, 441 సింగరేణి ఉద్యోగులు, 15 వేల పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. మార్చి 2న మరో 6 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామా అల్లుళ్లు, తండ్రీ కొడుకులు (కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్) తమ ప్రభుత్వంపై గ్లోబెల్స్‌లా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 2 వేల కోట్లతో పది స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయం- మా నినాదం
గతంలో ప్రతి పోస్టుకు డబ్బు ఇస్తే తప్ప పోస్టులు వచ్చేవి కావని సీఎం అన్నారు. తాము పారదర్శకంగా, సామాజిక న్యాయం పాటిస్తూ పోస్టింగ్‌లు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవి కావని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తారీఖున ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వ పాలనను గాడిలో పెడుతున్నామని, తాను, మంత్రులు సెలవు తీసుకోకుండా పని చేస్తున్నామని ఆయనఅన్నారు. రాష్ట్ర సెక్రటేరియెట్‌లో అందరినీ అనుమతిస్తున్నామని, గతంలో జర్నలిస్టులను కూడా రానివ్వలేదని, ఇప్పుడు ప్రతి చాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ‘‘గతంలో నన్ను, సీతక్కను సెక్రటేరియెట్‌కు వెళ్లనీయలేదు. కానీ, ఇప్పుడు అందరూ సెక్రటేరియెట్‌కు వెళ్లే స్వేచ్ఛ వచ్చింది. ఇది ప్రజలు ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.
జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు. త్వరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమించి రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ శబరీశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితోనే గెలిచినం
దీనులు, పేద ప్రజల కోసం రాజులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన సమ్మక్క, సారలమ్మలు దేవతలుగా మారి వందల ఏండ్లుగా ప్రజల నుంచి పూజలందుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘బడుగుల, ఆదివాసీల పక్షాన కొట్లాడి నేలకు ఒరిగినందునే వందల సంవత్సరాలైనా సమ్మక్క సారలమ్మను దేవుళ్లుగా కొలుస్తున్నాం. తమను నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు అమరులై వారు దేవతలుగా వెలిశారు. పదేండ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్‌పై సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితోనే పోరాడి విజయం సాధించాం.
ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజలను వేధించినప్పడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చలాయించాలనుకుప్పుడల్లా ఎవరో ఒకరు నిలబడతారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడినందునే ఈ రోజు పేదల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువై, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం” అని తెలిపారు. 2023 ఫిబ్రవరి ఆరో తేదీన హాత్ సే హాత్ జోడో యాత్రను తాను సమ్మక్క సన్నిధి నుంచే ప్రారంభించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు.
గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం మేడారాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే రూ.110 కోట్లతో జాతర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సుమారు ఒక కోటి యాభై లక్షల మంది భక్తులు పాల్గొనే జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, ఏర్పాట్లలో లోపం ఉండొద్దనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే జాతరపై దృష్టి పెట్టాల్సి రావడంతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బృందంగా ఏర్పాటు చేసి సమన్వయంతో పనులు చేయించామని తెలిపారు. జాతరలో కూడా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. 6 వేల ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని, అన్ని డిపోల నుంచి బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశించడంతో పాటు అదనంగా వంద కొత్త బస్సులు కొని జాతరకు వాటిని వినియోగించామని సీఎం వెల్లడించారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి షా మేడారం రావాలి
దక్షిణ కుంభమేళలాంటి మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ పండుగగా గుర్తించకపోవడం ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మేము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటున్నడు. మొన్న మేడారం వచ్చి జాతర పరిశీలించిన ఆయన మేడారానికి జాతీయ హోదా ఇవ్వబోమని చెప్పడం ఏమిటి? దీనిపై వెంటనే గిరిజన సామాజిక వర్గాలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
ప్రపంచంలోనే సమ్మక్క,-సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని.. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఇక్కడికి వచ్చి జాతరను చూడాలని, తమ నిర్ణయం ఏమిటో ప్రకటించాలని ఆయన అన్నారు. వీరిద్దరి రాకకోసం రాష్ట్ర ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. దేశాన్ని.. ఉత్తర, దక్షిణ దేశాలుగా బీజేపీ విభజించి పాలిస్తున్నదని, దీంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని అన్నారు.
రాష్ట్రాన్ని రూ. 7లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యాన్ని కండ్లకు కట్టినట్లు చూపించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ కండ్లు మూసుకొని ఫామ్‌హౌస్‌లో ఉండడంతో ఏపీ సీఎం కృష్ణా జలాలను తరలించుకుపోయిండు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ దివాలా తీయించిండు. కేసీఆర్ పదేండ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే కేంద్రంలోని బీజేపీ నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదు” అని ప్రశ్నించారు.