రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలున్నయ్ : సీఎం రేవంత్ రెడ్డి

  • ఓఆర్​ఆర్​, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తం 
  • ఇండస్ట్రియల్ కారిడార్ తో యువతకు ఉపాధి కల్పిస్తం 

హనుమకొండ/ వరంగల్, వెలుగు: హైదరాబాద్ తో పాటు రెండో రాజధానిగా అన్ని అర్హతలున్న వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంతోపాటు ఎయిర్ పోర్టును తీసుకొచ్చి మహర్దశ కల్పించే బాధ్యత తనదేనని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. స్వయంగా తానే ఇక్కడికి వచ్చి వరంగల్ లో కూర్చుని సమస్యలన్నీ సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటానని, హైదరాబాద్ కు దీటుగా డెవలప్ చేస్తానని మాటిచ్చారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కావ్యకు మద్దతుగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి అధ్యక్షతన మడికొండలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జన జాతర బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వరంగల్, అక్కడి నుంచి రామగుండం వరకు నేషనల్ హై వేస్​ను ఆనుకుని ఇండస్ట్రీయల్ కారిడర్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏస్సార్ఎస్పీ స్టేజ్​వన్​, టూ, దేవాదులతోపాటు ఉమ్మడి జిల్లాలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. అమెరికా ఐటీ రంగంలో రాణించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డి సహకారంతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

వరంగల్ టెక్స్ టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తామని, వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేరుకే స్మార్ట్ సిటీగా ఉన్న వరంగల్ ను చారిత్రాత్మక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం ఇక్కడి చెత్త సమస్యకు పరిష్కారం చూపలేదని, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల్లో చెత్తను సేకరించడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 

ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో కాకతీయ యూనివర్సిటీ నిర్వీర్యమైందని, తొందర్లోనే వర్సిటీకి కొత్త వీసీని నియమిస్తామన్నారు. కేయూను ప్రక్షాళన చేసి, అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు. 

బీఆర్​ఎస్ నాయకులు రౌడీలు, గూండాలు..

బీఆర్​ఎస్ లీడర్లలాంటి రౌడీలు, గూండాలు ఎక్కడా లేరని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. గత ప్రభుత్వంలో కేసులు, దౌర్జన్యాలతో ఎన్నో బాధలు పడ్డామని, వరంగల్​లో ఎర్రబెల్లి దయాకర్​రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​ప్రజల సొమ్ము తిని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. వాళ్లు చేసిన అక్రమాలు బయటకు తీసి ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. 

వరంగల్ యువత కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొస్తామని, వరంగల్ సమగ్రాభివృద్ధికి డీపీఆర్ తయారు చేయించి ముందుకెళ్తామన్నారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్​ భయం పట్టుకుందని మంత్రి సీతక్క అన్నారు. అందుకే సంకల్ప్ పత్రాల పేరున గ్యారంటీలు తీసుకొచ్చారని, వాటిని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే హామీలు అమలు చేస్తుంటే, బీఆర్​ఎస్ నాయకులకు భయమెందుకు అవుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు. 

ప్రభుత్వం మూడు నెలలే అవుతోందని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన అంశాలన్నీ అమలుచేయకుంటే ఇంకోసారి పోటీలోనే ఉండబోమని, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇదే మా ఛాలెంజ్ అని సవాల్​ చేశారు.ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్​ జంగా రాఘవరెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్​ కోదండరాం పాల్గొన్నారు.