ధియేటర్ దగ్గర ఒకరు చనిపోతే.. అల్లు అర్జున్ తీరిగ్గా సినిమా చూస్తున్నాడు : సీఎం రేవంత్ రెడ్డి

ధియేటర్ దగ్గర ఒకరు చనిపోతే.. అల్లు అర్జున్ తీరిగ్గా సినిమా చూస్తున్నాడు : సీఎం రేవంత్ రెడ్డి

పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన సీఎం.. అసలు ఆ రోజు ఏం జరిగింది.. హీరో అల్లు అర్జున్ ఏ విధంగా బిహేవ్ చేశారు అనేది సభలో వివరించారు. 

సంధ్య ధియేటర్ లో సినిమా చూడటానికి హీరో అల్లు అర్జున్ కు ఎలాంటి అనుమతి లేదని.. ఈ విషయాన్ని పోలీసులు ముందు చెప్పారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా కూడా ధియేటర్ లో సినిమా చూడటానికి వచ్చారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది.. మరో బాలుడి పరిస్థితి విషమంగా మారిందన్నారు. ఇంత జరిగినా హీరో అల్లు అర్జున్.. తీరిగ్గా ధియేటర్ లో కూర్చుని సినిమా చూస్తున్నాడని.. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటాడని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

తొక్కిసలాటలో ఒకరు చనిపోయారని.. రద్దీ ఎక్కువగా ఉందన్న విషయాన్ని ధియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ కు చెప్పినా వినిపించుకోలేదని.. ఏమీ పట్టనట్లు సినిమా చూస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటే ధియేటర్ నుంచి వెళ్లిపోవాలని పదేపదే కోరినా పట్టించుకోలేదన్న విషయాన్ని సభలో వివరించారాయన. ఆ తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు గట్టిగా చెప్పటంతో.. అప్పుడు ధియేటర్ నుంచి బయటకు వెళ్లారని.. సినిమా హీరోలకు బాధ్యత లేదా.. ప్రజల ప్రాణాలపై చిత్తశుద్ది లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఏసీపీకి కూడా మాట వినకపోతే.. డీసీపీ వచ్చి బలవంతంగా.. సినిమా మధ్యలోనే బయటకు పంపించారన్నారు. ఆ సమయంలో కూడా ధియేటర్ నుంచి బయటకు వచ్చి.. మళ్లీ చేతులు ఊపుతూ.. ర్యాలీ తీయటం ఏంటని ప్రశ్నించారు. ఓ ఏసీపీ స్థాయి అధికారి ఎంత చెప్పినా వినకపోవటం అంటే సమాజంపై అల్లు అర్జున్ కు ఎంత బాధ్యత ఉందో అర్థం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో ఒకరు చనిపోయారని.. మరో పిల్లోడు చావుబతుకుల మధ్య ఉన్నాడని చెప్పినా వినకుండా.. సినిమా చూస్తున్నాడు.