వాళ్లకు టీటీడీ ఉంటే.. మనకు వైటీడీ ఉంది.. ప్రతీసారి అడుక్కోవడం ఏంటి..? సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

వాళ్లకు టీటీడీ ఉంటే.. మనకు వైటీడీ ఉంది.. ప్రతీసారి అడుక్కోవడం ఏంటి..?  సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

తిరుమల దర్శనం గురించి గత కొంత కాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాంబాద్ రవీంద్ర భారతిలో ‘కొలువుల పండుగ’ కార్యక్రమానికి హాజరైన సీఎం.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ పోస్టులకు ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ దర్శనం గురించి సంచలన వ్యఖ్యాలు చేశారు.

తిరుమల దేవస్థానం దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతీసారి అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు. ‘‘వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా. ఎందుకు ప్రతీసారి బతిమాలుకోవడం. భద్రాచలంలో రాముడు లేడా.. మనకు శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా..?’’ అంటూ ప్రశ్నించారు. టీటీడీ వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఈ ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదని చాలా కాలంగా తెలంగాణ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు, ఎంపీలు పలుమార్లు విమర్శించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా సీఎం రేవంత్ కు నేతల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీనిపై తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.