![రాహుల్‌ది ఏం కులమో చెప్పు రేవంత్ రెడ్డి: బండి సంజయ్](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-should-tell-rahul-gandhis-caste-questioned-union-minister-bandi-sanjay_q2tMKrGASo.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టుకతో ఉన్నత కులం అయినటప్పటికీ, 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఖండించారు. పుట్టగానే మనిషికి కులం పేరు పెడతామా? అని బండి సంజయ్.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సంచలనం కొరకే ప్రధానిపై రేవంత్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బాధ్యతాయుత పదవిలో ఉండి రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
మోడీ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్సే అని బండి సంజయ్ అన్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు కనుక ఈ విషయం ఆయనకు తెలియదు అనుకుంటా అని సెటైర్లు వేశారు.
రాహుల్‌ది ఏం కులమో చెప్పు రేవంత్..?
రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం..? ఏ దేశం..? దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలి అని బండి సంజయ్ అన్నారు. సోనియా క్రిస్టియన్, ఇటలీ దేశస్తురాలు అయినప్పుడు.. ఆమె కొడుకు ఏ దేశస్థుడు అవుతాడు..? రాహుల్ గాంధీది ఏ కులమని మీరు ప్రోత్సహిస్తున్నారు..? రాహుల్‌కి కులం, మతం, దేశం, జాతి లేదు. రేవంత్ దీనికేం ఏం సమాధానం ఇస్తారు..? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మోదీని బీసీగా దేశమంతా గుర్తించిందని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను డైవర్ట్ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు.