తెలంగాణలోని ఆర్థిక, సహజ వనరులను కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకోవడంతో వంద ఏండ్ల వరకు రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ జన జాతర సభ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తాగునీటి సమస్యపై కేసీఆర్ బుర్ర లేకుండా వితండ వాదం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ సిటీలో వెయ్యి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తే...అభినందించాల్సింది పోయి ట్యాంకర్ల ద్వార నీటిని సరఫరా చేసుడేందని విమర్శిస్తారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
‘‘మీ నిర్వాకం వల్ల మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది...అందులో ఇంక నీరెక్కడిది? ఎత్తిపోసుడెక్కడ?” అని సీఎం ప్రశ్నించారు. ‘‘రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నావని కేసీఆర్ అంటుండు. అప్పుడు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా కూడా నా ఇంట్లోనే నిద్రపోతున్న. మీ లెక్క ఫామ్ హౌస్ లోనో.. సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లోనో పడుకుంటలే” అని ఆయన అన్నారు. ఇక్కడి సీఎం నిత్యం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేసీఆర్ అనడంపై రేవంత్ మండిపడ్డారు.
‘‘నీ పాపాలను ఒక్కొక్కటిగా కడిగే పనిలో భాగంగానే ఢిల్లీ వెళ్తున్న. ట్రిపుల్ ఆర్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ నది అభివృద్ధి, పెండింగ్ పనులకు నిధుల విడుదల వంటి వివిధ పనులపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న” అని అన్నారు. విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గత బీఆర్ఎస్ సర్కార్ లెక్క క్వింటాలుకు 10 కిలోల కమీషన్ కొట్టుడు ఉండదని స్పష్టం చేశారు. ‘‘నీ లెక్క కమీషన్ల దందాలు చేయం” అని కేసీఆర్‌పై మండిపడ్డారు.