ఫామ్​హౌస్​ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు..13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్​ ఎందుకు వస్తలే : సీఎం రేవంత్​ రెడ్డి

ఫామ్​హౌస్​ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు..13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్​ ఎందుకు వస్తలే : సీఎం రేవంత్​ రెడ్డి
  • ఆయనకు బాధ్యతలేదా? : సీఎం రేవంత్​
  • పదేండ్లు అధికారం అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు
  • ఏ పనికైనా ఫామ్​హౌస్​కే పోవాల్సిన దుస్థితి తెచ్చిండు
  • ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలే
  • నమ్మినోళ్లను ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు,
  • దోచుకునుడే కల్వకుంట్ల కుటుంబం నీతి
  • పదవులు తీసుకోకుండా ప్రజా సేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు
  • పదేండ్లలో పేదలకు కనీసం రేషన్​ కార్డులన్నా ఇచ్చిన్రా?
  • కొడంగల్​లో ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్​
  • నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీమ్​లు ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ మార్చి 31 లోగా ఇస్తామని ప్రకటన

మహబూబ్​నగర్, వెలుగు : ఫామ్​హౌస్​ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని కేసీఆర్​పై సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ‘‘శాసనసభ అంటే ప్రజల సమస్యలపై చర్చించేందుకు వేదిక. అలాంటి సభకు 13 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ ఎందుకు వస్తలే? ఆయనకు ఆ పదవి అవసరమా? అధికారంలో ఉంటే అధికారం చలాయించడం.. దాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టడమే ఆయన పని. కానీ, ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉండదా? ప్రజల గురించి ఆలోచించడా? ” అని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీములను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు.  

నాలుగు స్కీములకు సంబంధించి మొత్తం 20 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ అందజేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. గత బీఆర్​ఎస్​ పాలనలో నాయకులు, అధికారులు ప్రజల దగ్గరకు వెళ్లే వారే కాదని.. ప్రజల సమస్యలు తెలసుకునే వారే కాదని, దేనికైనా ఫామ్​హౌస్​కే వెళ్లాల్సిన పరిస్థితి అని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల దగ్గరికే అధికారులు, నాయకులు వెళ్తున్నారని తెలిపారు.  గడీలలో ఉండి పాలన చేస్తామంటే కుదరదని.. ప్రజాప్రతినిధి అయినా, అధికారి అయినా ప్రజల వద్దకు పోవాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.

‘‘అధికారులు, నాయకులే మీ వద్దకు వస్తున్నరు. ఏ స్కీమ్​ గురించి కావాల్నా వారికి చెప్పండి. అక్కడక్కడా కొందరు గందరగోళం సృష్టించేవాళ్లు ఉంటరు.. చిల్లరమల్లర పంచాయితీలు పెడ్తుంటరు. అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసర్లకు మీ పూర్తి వివరాలు ఇచ్చి.. స్కీమ్​లు అందుకోండి” అని ప్రజలకు సూచించారు. అర్హులందరికీ పథకాలు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. ప్రజల కోసం తాము పనిచేస్తుంటే  కేసీఆర్​, కేటీఆర్​కు కడుపు మండుతున్నదని.. అందుకే వారికి తమ నాయకులు ఈనో ప్యాకెట్లు పంపించారని, వాటిని తాగి కొంచెమైనా మంట తగ్గించుకోవాలని ఆయన  వ్యాఖ్యానించారు. 

కేసీఆర్​ కుటుంబంలా మేం దోచుకోం

కేసీఆర్​ కుటుంబంలాగా తన కుటుంబం పదవులు అనుభవిస్తలేదని, దోచుకోవడం లేదని సీఎం రేవంత్​ అన్నారు. నమ్మిన ప్రజలను దోచుకునే బుద్ధి కల్వకుంట్ల ఫ్యామిలీది అని మండిపడ్డారు. ‘‘కేటీఆర్​ నా తమ్ముడి గురించి మాట్లాడ్తున్నడు. ఏం పదవి ఉందని అంటున్నడు. నేను ఆయన్ను(కేటీఆర్​ను) అడుగుతున్న.. మీలెక్క మా వాళ్లేమైనా పదవులు తీస్కున్నరా? నువ్వు మంత్రి పదవి తీసుకుంటివి.. నీ చెల్లెలు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తిరి.. నీ బావ మంత్రి పదవి.. మీ నాయిన ముఖ్యమంత్రి పదవి తీసుకునే. నీ ఇంటిల్లిపాది పదవులు పంచుకుంటిరి. మా ఫ్యామిలీ పదవులు తీసుకోకుండా, ఆశించకుండా జనానికి సేవ చేస్తుంటే తప్పా? ప్రజలకు మా కుటుంబం అండగా ఉంటే కేటీఆర్​ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నడు. 

నమ్మిన ప్రజల కోసం నా కుటుంబం అందుబాటులో ఉంటున్నది.  మీలాగా(కేటీఆర్​) పదవులు, దోచుకోవడానికి పోటీ పడం. పేదలకు కష్టం వస్తే తోడుగా నిలబడ్తం. నమ్ముకున్న వారినే దోచుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మీలాగా పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి రాలేదు. పేదలకు అండగా ఉండాలని మా కుటుంబ పనిచేస్తున్నది. వీలైనంత వరకు సబ్​ స్టేషన్​, బస్ స్టేషన్​​, బడులకు కోట్లు విలువ చేసే మా సొంత భూములు ఇచ్చాం. ఎవరూ ఏం కావాలన్నా మా ఇంట్లో నుంచి పైసలు ఇచ్చినం” అని ఆయన తెలిపారు. 

బీఆర్​ఎస్​కు మనుగడ లేదు

‘‘లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయినా.. రాష్ట్రంwలో రికార్డు స్థాయిలో వరి పంటలు సాగయ్యాయి.  1.66 కోట్ల  టన్నుల ఉత్పత్తి జరిగింది.  సన్నాలకు రూ.500 బోనస్​ కూడా ఇచ్చాం” అని సీఎం రేవంత్​ అన్నారు.  పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్​ను ప్రశ్నించారు. ‘‘పదేండ్లు వాళ్లు అధికారంలో ఉన్నా.. కొడంగల్​–-నారాయణపేట స్కీమ్​కు  కొబ్బరికాయ కూడా కొట్టలేదు.  భీమా, ఎంపీకేఎల్​ఐ, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, ఆర్డీఎస్​ను పూర్తి చేయలేదు. పదేండ్లు కేసీఆర్​కు తీరిక లేకుండా వాళ్ల కుటుంబ క్షేమమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు” అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పీఆర్​ఎల్​ఐ, కొడంగల్​–-నారాయణపేట స్కీములను అందుబాటులోకి తేవాలని కష్టపడుతుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారని, అవి పూర్తయితే రాష్ట్రంలో ఆ పార్టీకి(బీఆర్​ఎస్​కు) మనుగడ ఉండదనే అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. 

పేదలకు ఇండ్లు అనగానే మాజీ సీఎం వైఎస్సార్​ గుర్తుకువస్తారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘2004 నుంచి 2014 వరకు ప్రతి నిరుపేదకు ఇండ్లు ఇచ్చారు. కాంగ్రెస్ గత​ హయాంలో కొడంగల్​ నియోజకవర్గానికి  36 వేల ఇండ్లను  మంజూరు చేయించుకున్నాం. దీనిపై కేసీఆర్​కు కడుపు మండి కొడంగల్​కు సీబీసీఐడీ పంపి ఎంక్వైరీ చేయించిండు. వాళ్ల(బీఆర్​ఎస్​) ప్రభుత్వం పదేండ్లలో కొడంగల్​ నియోజకవర్గానికి ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేయలేదు” అని తెలిపారు. రెండున్నర నెలల్లో కొడంగల్​ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తామని, ఐదేండ్లలో 20 వేల ఇండ్లను నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి పేదవాడిని ఒక ఇంటివాడిని చేసే బాధ్యత తీసుకుంటానన్నారు.

రేషన్​ కార్డుల మీద సన్నబియ్యం

పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​కు కనీసం పేదలకు రేషన్​ కార్డులు ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేకుండాపోయిందని సీఎం రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘'కేసీఆర్​ గొప్ప మేధావి.. 80 వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకుంటడు. ఆయన కొడుకు అమెరికాలో చదువుకున్నడట. అలాంటి ఇద్దరికీ  పేదలకు రేషన్​ కార్డులు జారీ చేయాలనే కనీసం జ్ఞానం లేదు. రేషన్​ కార్డుల కోసం ప్రజలు పదేండ్లు ఎదురు చూసినా ఇవ్వలేదు” అని అన్నారు. 

తమ ప్రభుత్వం 40 లక్షల కుటుంబాలకు రేషన్​ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, రేషన్​ కార్డు అందుకునే  ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి అర్హుల వివరాలు తీసుకుంటున్నామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా ఆఫీసర్లను గ్రామాలకు పంపుతామని తెలిపారు. 

ఆఫీసర్లను చంపాలని చూసిన్రు

కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పరిశ్రమల కోసం 1,300 ఎకరాల భూ సేకరణ చేయాలని చూశామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పరిశ్రమల స్థాపన ద్వారా ఇక్కడ 40 వేల ఉద్యోగాలకు వస్తాయని ఆశించాం. కానీ భూ సేకరణకు వెళ్లిన ఆఫీసర్ల మీద దాడులు చేయించారు. వారిని చంపాలనే కుట్ర చేశారు. ఇదేం అన్యాయం. వాళ్ల(బీఆర్​ఎస్​) ప్రభుత్వంలో ఇట్ల చేసి ఉంటే పరిపాలన సాగించే వాళ్లా? కొడంగల్​ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే దాడులు చేయిస్తున్నరు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. 

వెనుకబడిన మనం(కొడంగల్​ ప్రజలు) ఎప్పుడూ వెనుకబడే ఉండాలా? ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్టాండ్, కొడంగల్​, మద్దూరు, దౌల్తాబాద్, గుండామాల్​ బస్టాండ్లలో  లుంగీలు కట్టుకొని ఖాళీగా తిరగాల్నా? మన పిల్లలు చదువుకొని డాక్లర్లు, ఇంజనీర్లు కావొద్దా?  నియోజకవర్గానికి ఇంజనీరింగ్, మెడికల్​, పాలిటెక్నిక్​​, డిగ్రీ, జూనియల్​ కాలేజీలు తీసుకురావద్దా? చదువుకోడానికి విద్యాలయాలు ఉండాలని, ఉద్యోగాలు రావాలని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కేసీఆర్​ మనుషులు కొడంగల్​ను ముంచేందుకు సిద్ధమైన్రు. అభివృద్ధికి అడ్డుపడ్తున్నరు” అని ఆయన మండిపడ్డారు. 

ఆఫీసర్లకు సహకరించి స్కీములు పొందండి

‘‘గత పదేండ్లలో మీదగ్గరికి వచ్చిన ఆఫీసర్లను చూశారా? ఆర్డీవో, ఎమ్మార్వోలను చూశారా? మా ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే మూడుసార్లు గ్రామ సభల ద్వారా పల్లెలకు ఆఫీసర్లను పంపినం. ప్రతి ఆఫీసర్​ను గ్రామాల బాట పట్టించినం. గతంలో ప్రతి పనికి  ఫామ్​హౌస్​కు పోవాల్సి ఉండేది . ఇప్పుడు ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నరు. ప్రజలే రాజులు. అందరూ ప్రజల దగ్గరికే రావాలి. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ మార్పు వచ్చింది. కలెక్టర్లు, హౌసింగ్​, రెవెన్యూ ఆఫీసర్లు అందరూ గ్రామాలకు వస్తున్నరు” అని ప్రజలతో సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఫామ్ హౌస్​లలో పడుకొని, గడీలలో ఉండి పాలన చేస్తామంటే కుదరదని..

ప్రజాప్రతినిధి అయినా, అధికారి అయినా ప్రజల వద్దకు పోవాల్సిందేనని చెప్పారు. ‘‘అధికారులు, నాయకులే ప్రజల వద్దకు వస్తున్నరు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వినతులు తీసుకుంటున్నరు. రేషన్​ కార్డులు, రైతు భరోసా, ఫ్రీ కరెంటు, ఉద్యోగాల భర్తీ, రుణమాఫీ ఏ కార్యక్రమమైనా ప్రజల వద్దకు వచ్చి అడుగుతున్నరు. అక్కడక్కడా కొందరు గందరగోళం సృష్టిస్తున్నరు..  చిల్లరమల్లర పంచాయితీలు పెట్టాలని చూస్తున్నరు. అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తంగా ఉండండి” అని తెలిపారు. ఆఫీసర్లే మీ వద్దకు వచ్చి, మీ వివరాలు తీసుకుంటున్నారని, వారికి మీ పూర్తి వివరాలు ఇచ్చి..స్కీమ్​లు అందుకోవాలని ప్రజలకు సీఎం రేవంత్​ సూచించారు. 

మార్చి 31 వరకు అర్హులందరికీ అమలు

మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. గణతంత్ర దినోత్సవాన ప్రారంభించిన ఈ నాలుగు స్కీములను ప్రభుత్వం నిరంతరాయం కొనసాగిస్తుందని చెప్పారు. ‘‘మొదటి విడత కింద మార్చి 31వ తేదీలోపు నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లను  22.550 లక్షల కోట్లతో అమలు చేసే బాధ్యతను తీసుకుంటాం. రైతు భరోసా కింద మార్చి 31 వరకు రూ.10 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే బాధ్యత మాది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పది లక్షల నిరుపేద రైతు కుటుంబాలకు మార్చి 31 వరకు రూ.6 వేల చొప్పున వారి అకౌంట్లలో నగదును జమచేస్తం. రేషన్​ కార్డులు లేని ప్రతి నిరుపేదకు మార్చి 31వ తేదీ వరకు కార్డులు అందిస్తాం. 

ముంబై, పుణె  ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారు కూడా సొంతూర్లకు వచ్చి కార్డులు తీసుకోవాలి. కార్డు మీద సన్న బియ్యం ఇచ్చే బాధ్యత నాది. ఈ స్కీములు అమలు చేయాలంటే మీరంతా నాకు అండగా నిలబడాలి. ఎవరైనా ఈ స్కీములకు అడ్డుపడితే.. అడ్డు తొలగించే బాధ్యత నాది. ఇప్పుడు ఆదివారం బ్యాంకులకు సెలవు. అర్ధరాత్రి తర్వాత నుంచి మీ బ్యాంక్​ ఖాతాల్లో రైతు భరోసా, ఆత్మీయ భరోసా పైసలు టపీ టపీ మని పడ్తయ్” అని సీఎం తెలిపారు. భూమికి, విత్తనానికి మాదిరి రైతుకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి..  రైతుల వద్దకు ధైర్యంగా వెళ్తున్నదని చెప్పారు.

చంద్రవంచలో4 స్కీమ్​లు ఇట్లా..

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా కింద మొత్తం 734 మంది రైతులు ఎంపికయ్యారు. వీరి కోసం గ్రామానికి చెందిన మల్లయ్య, ముక్కి నర్సింహులు, ఆంజనేయులు, భాగ్యమ్మ, వెంకటమ్మకు రూ. 97,93,350 చెక్కును సీఎం రేవంత్​రెడ్డి అందించారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 33 మంది ఎంపిక కాగా.. పార్వతమ్మ, నర్సమ్మ, పల్లెగారి తిరుమలమ్మ, సునితమ్మ, భాగ్యమ్మకు రూ.1.98 లక్షల చెక్కును ఇచ్చారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలుగు మంగమ్మ, అనంతమ్మ, రాములమ్మ, నర్సమ్మ, మొగులమ్మకు రూ.11.80 కోట్ల ప్రొసీడింగ్స్​ ఇచ్చారు. ఈ స్కీము కింద చంద్రవంచలో 236 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కొత్త రేషన్​ కార్డుల ప్రొసీడింగ్స్​ కూడా సీఎం రేవంత్​రెడ్డి అందజేశారు.