- 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా?
- ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊకుంటమా?: సీఎం రేవంత్‌రెడ్డి
- పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్
- బీఆర్ఎస్కు ఓట్లేయకపోవడం ప్రజల తప్పన్నట్లు మాట్లాడ్తున్నడు
- ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడినా ఆయనకు కనువిప్పు కలుగలే
- జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించే విద్యుత్ కమిషన్‌ను వేసినం
- వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషన్నే తప్పుపడ్తరా?
- సత్యహరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా?
- రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తం
- పాలనలో జీవన్‌రెడ్డి అనుభవాన్ని వాడుకుంటం
- కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదు..
- పీసీసీ కొత్త చీఫ్‌పై ఖర్గేతో మాట్లాడినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ‘వంద ఎలుకలు తిన్న పిల్లి... తీర్థయాత్రలకు పోయిందన్నట్లు’ కేసీఆర్ తీరు ఉందని, ఈ విషయంలో ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా? గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆయన బీఆర్ఎస్లోకి తీసుకున్నది వాస్తవం కాదా? చేసిన తప్పులకు క్షమించాలని తొలుత అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలి” అని వ్యాఖ్యానించారు. 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అన్నారని.. దానికి బీజేపీ వంత పాడిందని మండిపడ్డారు.
‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్, బీజేపీ రోడ్లపై రంకెలేస్తే.. గాలికి వదిలేయాల్నా?” అని సీఎం ప్రశ్నించారు. గురువారం మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్కు ఓట్లేయకపోతే ప్రజలది తప్పా?
అసెంబ్లీలో 35 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్.. ఎంపీ ఎన్నికల్లో 16 శాతం ఓట్లకు పడిపోయిందని సీఎం అన్నారు. ‘‘17 ఎంపీ స్థానాలు ఓడి, 8 సీట్లలో డిపాజిట్ కోల్పోయి.. 14 స్థానాల్లో థర్డ్ ప్లేస్‌లో నిలిచి నా కేసీఆర్‌కు ఇంకా కనువిప్పు కలగడం లేదు. బీఆ ర్ఎస్కు ఓట్లేయకపోవడం ప్రజల తప్పు అన్నట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నరు” అని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు వేయించింద ని, కేటీఆర్ సెగ్మెంట్ సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ ప్లేస్, సిద్దిపేటలో బీజేపీ–కాంగ్రెస్‌కు సమానంగా ఓట్లు ఎట్ల వచ్చాయని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్కు కంచుకోటగా చెప్పుకునే మెదక్‌లో ఎందుకు థర్డ్ ప్లేస్‌లోకి వచ్చిందని ప్రశ్నించారు.
రాహుల్ గ్యారంటీ అంటే 100 పర్సెంట్ పక్కా
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్లో ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ గ్యారంటీ ఇచ్చారంటే.. అది 100 శాతం అమలవుతుందని తెలిపారు. ‘‘వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దాదాపు రూ.31వేల కోట్లతో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం అహర్నిషలు శ్రమిస్తున్నాం. పాలనను గాడిలో పెట్టాం” అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. క్రిస్మస్, రంజాన్, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వచ్చాయని.. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల టైంలో ఏపీలో 40, 50 మంది అధికారులను బదిలీ చేస్తే.. తెలంగాణలో ఏ చిన్న ట్రాన్స్ఫర్ లేదని అన్నారు. ఎన్నికల నిర్వహణలో బీఆర్ఎస్తో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా తమపై ఎలాంటి ఆరోపణ చేయలేకపోయిందని పేర్కొన్నారు. ఏ చిన్న సంఘటన కూడా జరగలేదంటే.. పాలన బాగున్నట్లా? బాగాలేనట్లా? అని ప్రశ్నించారు. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో, అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో లేవన్నారు.
త్వరలో ప్రధానిని కలుస్తం
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని సీఎం తెలిపారు. త్వరలోనే ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్ససంబంధాలను కొనసాగించాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నదని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా ఎలా కోట్లాడాలో ఆ విధంగానే కోట్లాడుతామని చెప్పారు. ‘‘ఇప్పుడు పరిపాలన చేసే సమయం కాబట్టి వచ్చే బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించాలని కేంద్రంలోని అందరినీ కలుస్తం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని.. కేంద్రం నుంచి నిధులు, అనుమతులు, ఏపీతో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తం.
చంద్రబాబుతో వీలైనమేరకు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటం. కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యల పరిష్కారం కోసం కోర్టులున్నయ్. పక్కరాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయ పడం. మా రాష్ట్ర అభివృద్ధి కోసం అలసత్వం ప్రదర్శించబోం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, అందుకోసం రాష్ట్ర పురోగతికి రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని తెలిపారు. తనకు కేసీఆర్‌లాగా ఫాంహౌసుల్లో పడుకునే అలవాటు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
మీ ఎమ్మెల్యే కోరిక మేరకే కమిషన్ వేసినం
విద్యుత్తు కొనుగోళ్ల మీద విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాదించలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ కోనుగోళ్లు, యాదాద్రి, భద్రాది పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అసెంబ్లీలో విసిరిన సవాల్‌ను మాత్రమే స్వీకరించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కమిషన్ ఏర్పాటు తర్వాత మూణ్నెళ్ల దాకా బీఆర్‌ఎస్, కేసీఆర్ ఏం మాట్లాడలేదని.. వచ్చి వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు లేఖ రాగానే ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘విచారణ కమిషన్‌ను వేయడం తప్పా? కేసీఆర్‌ను వివరణ ఇవ్వాలని అడిగినందుకు తప్పుపడుతున్నారా? జస్టిస్ నర్సింహారెడ్డిని తప్పుపడుతున్నారా? అనేది బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఇవ్వాలి.
బీఆర్‌ఎస్ నేతల మాటలలోనే వ్యత్యాసం ఉంది. వాళ్లకే ఈ విష యంలో సమన్వయం లేదు. సత్యహరిశ్చంద్రులైతే ఇట్ల అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటే సరిపోతుంది కదా? కమిషన్‌లోనే లోపాలు ఉన్నాయనుకుంటే కేసీఆర్ విచారణకు వెళ్లి తన అనుభవాన్ని, అద్భుతంగా వాదించుకోవచ్చు కదా! వారు (బీఆర్ఎస్) కోరుకుంటే లైవ్ టెలికాస్ట్ కోసం ప్రభుత్వం కూడా కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలే దని.. కానీ, పలు మీడియా సంస్థలు.. మంత్రివర్గ విస్తరణ చర్చలు చేసి, శాఖలు కేటాయించి, ప్రమా ణస్వీకారానికి ముహూర్తాలు పెట్టాయని రేవంత్అన్నారు. వచ్చే నెల 7తో తన పీసీసీ పదవీకా లం ముగుస్తున్నందున ఆ లోపే సామాజికన్యా యం, సమర్థవంతంగా కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కోరినట్టు రేవంత్ తెలిపారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
విద్యాశాఖకు నేను ఫుల్ టైం మంత్రిని...
మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా తానేమీ ఫామ్‌హౌస్‌లో పడుకొని ప్రభుత్వాన్ని నడపడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యా శాఖకు తాను ఫుల్ టైం మంత్రినని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని తెలిపారు. తమలాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్ర మంత్రులను బీజేపీ పాలిత సీఎంలు, మంత్రులు కూడా కలవడం లేదని.. భేషజాలకు పోకుండా ప్రతి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతున్నామని వివరించారు. విద్యా శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ పాలనలో ఎక్కడైనా లోపాలు జరిగితే చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయ పార్టీలు నడిపే మీడియా సంస్థలు.. పలు శాఖలకు మంత్రులు లేరన్న విష ప్రచారం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. దీని వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గోతికాడి నక్కలకు.. జీవన్‌రెడ్డి రిప్లే ఇచ్చారు...
దాదాపు 40 ఏండ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘6 గ్యారంటీల అమలు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ జాయినింగ్ విషయంలో మా వైపు నుంచి సమన్వ యం చేయడంలో లోపం జరిగి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు. ఈ గందరగోళాన్ని గుర్తించిన మంత్రి శ్రీధర్ బాబు తక్షణమే జీవన్ రెడ్డితో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవచూపారు.
మరోవైపు తెలంగాణపై, కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డికి ఉన్న కమిట్మెంట్, అనుభ వాలను దృష్టిలో పెట్టుకొని.. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఆయనతో మాట్లాడారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా.. జగిత్యాల, కరీంనగర్ కు చెందిన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్, సీఎంగా అధిష్టానం ఆదే శాలను పాటిస్తా” అని ఆయన పేర్కొన్నారు. అయితే జీవన్ రెడ్డి ఇష్యూ పేరిట కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా కొన్ని గోతికాడి నక్కలు ఎదురుచూ శాయని ప్రతిపక్ష పార్టీల నేతలపై ఫైర్ అయ్యారు. కానీ కాంగ్రెస్‌పై ఉన్న చిత్తశుద్ధి, అనుభవంతో వాళ్లకు జీవన్‌రెడ్డి బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
అవతరణ దినోత్సవానికి పిలిస్తే ఎందుకు రాలే?
‘‘మొన్నటి వరకు ఎమ్మెల్యేలను గేట్ల లోపలికి రానియ్యని కేసీఆర్.. ఇప్పుడు పిలిచి భోజనా లు పెడుతున్నడు. తలుపులు మూసి కాళ్లు పట్టుకుంటుండో.. కడుపులో తలకాయ పెడ్తు న్నడో కానీ ఆ పార్టీ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ఆయనను నమ్మరు” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఢిల్లీకి పోయి మోదీ కాళ్లు పట్టుకుంటాం, కడుపుల దూరుతాం - కాంగ్రె స్ ప్రభుత్వాన్ని కూలగొడతాం’.. ఇదే కదా కేసీఆర్ దిక్కుమాలిన ఆలోచన” అని మండి పడ్డారు. ప్రతిపక్ష నేత అని అసెంబ్లీ, రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఆహ్వానిస్తే కేసీఆర్ రాలేదని ఆయన అన్నారు. అవతరణ దినోత్స వాల్లో ప్రతిపక్ష నేతగా మాట్లాడేందుకు అవ కాశం ఇవ్వాలని కోరేందుకు కేసీఆర్ కు సిగ్గుండాలని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంప్రదాయం ఉందో ఆయనే చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ‘‘పదేండ్లలో ప్రతిపక్ష నేత లను ఏనాడైనా కేసీఆర్ పిలిచారా?’’ అని ఆయన నిలదీశారు. తాము పిలిచినా కేసీఆర్ రాలేదని అన్నారు. ఏమాత్రమైనా ఉద్యమ నేతగా కేసీఆర్ కు సోయి ఉండి ఉంటే.. పదేండ్ల తెలంగాణ ఉత్సవాల్లో హుందాగా హాజరయ్యేవారని తెలిపారు. ‘‘స్వార్థం, దోపి డీ, తన కుటుంబానికే అన్ని ఉండాలన్నది కేసీఆర్ కోరిక. ఇవి ఎల్లకాలం వాళ్లను బతికించవు” అని ఆయన తేల్చిచెప్పారు.
ఫైనల్ గా పార్టీనే ఉంటుంది: మంత్రి శ్రీధర్ బాబు
నేతల్లో చిన్న చిన్న విభేదాలున్నా.. ఆఖరుకు కాంగ్రెస్ పార్టీనే తమలో ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం ఆయ న మీడియాతో మాట్లా డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జాయి నింగ్ విషయంలో జీవన్ రెడ్డి ఒకింత మనస్తా పం చెందారని ఆయన అన్నారు. ఈ విషయంలో హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వచ్చిన జీవన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలిపారు. పార్టీ బలోపేతం, పార్టీ కార్యకర్త లకు సం బంధించిన అంశాలపై చర్చించినట్లు వివరించారు. కాంగ్రెస్ అంతర్గత అంశాలతో పార్టీ లో చిచ్చుపెట్టాలని కొన్ని పార్టీల నేతలు చూ శారని ఆయన ఫైర్ అయ్యారు. కానీ.. అందు కు భిన్నంగా పార్టీ నేతలు చూపిన ఐకమ త్యం.. చిచ్చుపెట్టాలనుకున్న ఇతర పార్టీ లీడర్ల కు మేలుకొలుపని అన్నారు.