తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే.. కాళ్లల్లో కట్టెలు పెడుతున్నరు : సీఎం రేవంత్

  • మీరు పదేండ్లలో  చేయని పనులు 10 నెలల్లో చేసినం
  • పడావు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించినం 
  • ​50 వేల జాబులిచ్చినం.. 18 వేల కోట్ల రుణమాఫీ చేసినం
  • కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా.. కూసోబెట్టి లెక్కలు చెప్త
  • లగచర్ల కుట్రలో కేటీఆర్  ఊచలు లెక్కపెట్టాల్సిందే
  • హరీశ్ రావు ​ఫాంహౌస్​​ లెక్కలూ బయటకు తీస్తున్నం
  • ఎములాడ రాజన్నకూ కేసీఆర్ ​మోసం.. 100 కోట్లు కూడా ఇయ్యలే  
  • వేములవాడ ప్రజాపాలన -విజయోత్సవ సభలో  సీఎం రేవంత్

రాజన్న సిరిసిల్ల/వేములవాడ,  వెలుగు: తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. పదేండ్లలో కేసీఆర్ ఏం వెలగబెట్టారని  ప్రశ్నించారు. పదేండ్లు ప్రభుత్వం నడిపినోడు పది నెలలు కాకముందే తమను దిగిపో అంటున్నారని మండిపడ్డారు. ‘‘నువ్వు దిగిపో.. మేం కూసుంటం  అంటుండు. పదేండ్లలో  మీరు చేయలేని పని మేం చేస్తుంటే మీకు నొప్పి ఎందుకు? సోషల్ మీడియాలో నాలుగు హౌలా పోస్టులు పెట్టి సంబురపడుతున్నరు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తాం” అని  వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో సాధ్యం కాని పనులను తాము పది నెలల్లో చేసి చూపించామని అన్నారు. కేసీఆర్​ పడావుపెట్టిన  ప్రాజెక్టులన్నింటినీ పున:ప్రారంభించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. 

50 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా ఎల్బీ స్టేడియం వేదికగా క్షమాపణ చెబుతానని తెలిపారు. రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్‌ ఐదేండ్లు తీసుకుంటే.. తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. పెద్ద మనిషిగా కేసీఆర్​ రుణమాఫీని అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో బుధవారం రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్​పార్టీపై విరుచుకుపడ్డారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కూడా కేసీఆర్​ మోసం చేశారని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్..   రూ.100 కోట్లతో వేములవాడ  ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. పది నెలల కాలంలో తాము ఒక్కొక్క అభివృద్ధి పని చేసుకుంటూ పోతుంటే కేసీఆర్​ఏమో ఫామ్​హౌస్​లో పడుకున్నాడని, బావాబామ్మర్దులు (కేటీఆర్, హరీశ్​రావు) ఇద్దరూ తమ కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా సామీ .. నువ్వు 80 వేల పుస్తకాలు ఏం చదివినవో మాట్లాడుదాం.. మీరు చేసిన రుణమాఫీ.. మేం చేసిన రుణమాఫీ వివరాలు బయటకు తీసి, చర్చకు పెడదాం. మీరొస్తే కూర్చొబెట్టి లెక్కలు చదివి వినిపిస్తాం” అని సీఎం సవాల్​ చేశారు.


బీఆర్ఎసోళ్లకు మైండ్ దొబ్బంది..

ఏలేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు.. కేసీఆర్​ను ఓడగొట్టి ఇంట్ల పండబెట్టినా ఇంకా మన వెంట పడుతూనే ఉన్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్​ మండిపడ్డారు.  ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంట్​లో సీట్లన్నీ పొయ్యి గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వాళ్లకు పూర్తిగా మైండ్​దొబ్బింది.  వాళ్లు ఏం మాట్లాడుతున్నరో నాకైతే అర్థమైతలే” అని బీఆర్ఎస్​నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పదేండ్లలో కేసీఆర్​ అన్నీ చేసి ఉంటే  ఇయ్యాల తమకు 18 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన అవసరం వస్తుండెనా? అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్​ మొదటి ఐదేండ్లు లక్ష రుణమాఫీ చేస్తానని.. 4 విడతలని.. ఐదేండ్లని.. రూ. లక్ష ఏసేలోపల ఇంకో లక్ష మిత్తి అయింది. అసలు మిత్తి కలిసి తడిసి మోపెడైంది. రెండోసారి మళ్లా లక్ష ఏస్తనని ఐదేండ్లయినా ఎయ్యలే. ఆ ఐదేండ్లలో ఆయన ఇచ్చింది కేవలం 11 వేల కోట్ల రూపాయలు మాత్రమే” అని వివరించారు. కేసీఆర్​రైతులను మోసం చేశారని, అందుకే గత పదేండ్లలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని అన్నారు. 

కాళేశ్వరం నుంచి చుక్క రాకపోయినా రికార్డు స్థాయిలో వడ్లు 

ఆనాడు అన్నదాతలు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది అని, నేడు ఆ రైతులే ఒక్క చుక్క కాళేశ్వరం  నీళ్లు లేకుండా 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేండ్లలో కేసీఆర్   ప్రాజెక్టుల కోసం 1.23 లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ‘‘ఇయ్యాల  సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామంటే 66 లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  తెలంగాణ గడ్డ పండించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి  ఇంత పంట రాలే. ఇది మన రైతుల గొప్పతనం. గతంలో వడ్లు పండితే  కాళేశ్వరం నీళ్ల వల్లే అని కేసీఆర్ ఊదరగొట్టిండు. కానీ ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కుప్పకూలినయ్​. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా  ఎస్సారెస్సీ, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, హంద్రీనీవా, బీమా, నెట్టెంపాడు సహా ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఇయ్యాల ఇంత పంట పండించినం. 1 లక్ష 83 వేల కోట్ల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు.. ఏ ప్రాజెక్టునైనా కేసీఆర్​ పూర్తిచేసిండా?” అని రేవంత్​ ప్రశ్నించారు. 

ఇచ్చిన మాటకోసం ఎంతదూరమైనా వెళ్తాం

తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కరీంనగర్ గడ్డ మీది నుంచే సోనియా గాంధీ ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారని రేవంత్​ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఎంతదూరమైనా వెళ్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు.  తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిడ్డ, జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తుంది.  పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపీగా గెలిపిస్తే పెప్పర్​ స్ప్రేలకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించారు. 

బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండు సార్లు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిస్తే కేంద్ర మంత్రి అయ్యారు కానీ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు కేంద్రం నుంచి చిల్లి గవ్వ అయినా తెచ్చారా? కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారా? అంతకు ముందు 3 సార్లు బీఆర్ఎస్​ ఎంపీలను గెలిపిస్తే వాళ్లు కూడా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేసిందేమీ లేదు” అని పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ తరుచూ తనను వేములవాడ అభివృద్ధి గురించే అడుగుతారని, వేరే కాంట్రాక్టులు కావాలంటూ అడగరని అన్నారు. సిరిసిల్లలో కేకే మహేందర్​రెడ్డిని గెలిపించకపోయినా అభివృద్ది ఆగదని చెప్పారు. గల్ఫ్​ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు పెట్టామని, గల్ఫ్​ కార్మికులు గల్ఫ్​ కంట్రీస్​లో మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల మంది ఆడబిడ్డలకు కాటన్, పాలిస్టర్​ మిక్స్​డ్​తో ఉత్పత్తి చేసిన నాణ్యమైన చీరలను అందజేస్తామని ప్రకటించారు.  

హరీశ్​ రావు లెక్క తేలుస్తాం.. 

రంగనాయకసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టుకున్నారని, భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని తన పేరు మీదకు రాయించుకున్నారని రేవంత్ అన్నారు. ‘‘తన ఫామ్ హౌస్ కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలట. అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ప్రాజెక్టు నుంచి తొలగించి హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నడు. దానికి హరీశ్ రావు లెక్క జెప్పాల్సిందే. ఏం చింతపడకు హరీశ్​రావు.. నీ లెక్క చెప్తా .. అన్ని లెక్కలు తీయిస్తున్నాం” అని అన్నారు. ‘‘కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీయడానికి. వేల కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి  ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా..? ఇది న్యాయమా కేసీఆర్?” అని ప్రశ్నించారు.
  
బావ కండ్లల్లో ఆనందం కోసంబామ్మర్దిని వదిలిపెట్టాలా?

డ్రగ్స్​ తీసుకున్నోళ్లు ఇంట్లో దొరికితే, అనుమతిలేని విదేశీ మద్యంతో పట్టుబడితే కేసులు పెట్టొద్దా? అని రేవంత్​ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్​..నీ కొడుకు (కేటీఆర్​)ను మున్సిపల్ మినిస్టర్ గా పెడితే 111 జీవోలో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుంటడు. ఆయన బామ్మర్ది ఇంకో ఫామ్ హౌస్ కట్టుకుంటడు. దీపావళి పండుగొచ్చిందని చిచ్చు బుడ్లు కాకుండా సారాబుడ్లు పెట్టుకుని తాగుతుంటరు. ఏమన్నా అంటే క్యాసినో నడుపుకుంటం. సారాబుడ్లు పెట్టుకుంటం. మమ్మల్ని ఏమి అనొద్దంటరు. బావ (కేటీఆర్) కండ్లల్లో ఆనందం చూడ్డాడానికి ఆయన బామ్మర్ది ఏం చేసినా, డ్రగ్స్ తీసుకున్నా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచించండి.  ఊరులో తెలిసో తెలియకో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వీపు పలగ్గొట్టి రూ.5 వేల ఫైన్ వసూలు చేసిన సన్నాసులు వీళ్లు. పేదలకో చట్టం? మీకో చట్టమా? ” అని రేవంత్​రెడ్డి మండిపడ్డారు.  

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తం..

కరీంనగర్​ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్న ను దర్శించుకున్నా.
మిడ్ మానేరు నిర్వాసితుల పోరాటంలో పాల్గొన్న. ఆనాడు మిడ్ మానేరు నిర్వాసితులకు హామీ ఇచ్చినా.. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి  రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పిన. చెప్పినట్టే ఇయ్యాల మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 మందికి రూ. 270 కోట్లు ఇస్తున్నం. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, సిరిసిల్లలో 9వ ప్యాకేజీ పనులను కంప్లీట్ చేస్తం.ఈ పనిని ఇరిగేషన్ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్​చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటరు” అని తెలిపారు. 

679 కోట్లతో అభివృద్ధి పనులు

ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో రూ. 679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.  వేములవాడలో రూ. 76 కోట్లతో  శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి  పనులు, రూ.236  కోట్లతో 4,696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులు, రూ.50 కోట్లతో వేములవాడలో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. రూ. 47.8 కోట్లతో మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్త రణ పనులు,  రూ. 166  కోట్లతో వైద్య కళా శాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, రూ.35 కోట్లతో అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్ల 80 లక్షలతో నిర్మించే డ్రైన్ పనులు, మేడిపల్లి మండలంలో 5 కోట్లతో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో 42 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం పనులకు శంకు స్థాపన చేశారు.  సిరిసిల్ల లో  రూ. 28 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేము లవాడలో  రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని వర్చువల్ విధానంలో​  ప్రారం భించారు.   వీర్నపల్లిలో పీహెచ్​సీ ని ర్మాణానికి రూ.1.50 కోట్లు,  ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ. 5 కోట్లు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు  11. 79 కోట్లు రిలీజ్​ చేశారు.

కొడంగల్​పై నాటి పాలకులు దయచూపలే

తన నియోజక వర్గమైన కొడంగల్ పై గత పాలకులు దయచూపలేదని సీఎం రేవంత్​ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొడంగల్ నుంచి ఎవ్వరు మంత్రి కాలేదని తెలిపారు. ‘ఇప్పుడు నేను కొడంగల్ నుంచి గెలిచి, ముఖ్యమంత్రినైనందుకు.. అక్కడ అభివృద్ధి చేసేందుకు, మా గ్రామాలు ఎడారిగా మారాయని  నారాయణ్ పేట్– -కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా  లక్ష ఎకరాలకు నీళ్లిచ్చేందుకు  పని మొదలు పెడితే నా కాళ్లల్లో హరీశ్​ రావు  కట్టె పెడుతున్నాడు” అని రేవంత్​ మండిపడ్డారు. ‘‘నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష గట్టినవ్ కేసీఆర్. నీ లెక్క లక్ష ఎకరాలు సేకరించలే. నేను నాలుగు ఊర్లలో కలిపి 1,100 ఎకరాలు సేకరించిన. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇప్పుడు ఢిల్లీ అయిపోయింది. ఇప్పుడు చంద్రమండలం పోతడట. అక్కడ కూడా ఫిర్యాదు చేస్తడట. నీవు యాడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊచలు లెక్కపెడుతవ్​ గుర్తుంచుకో కేటీఆర్. నీ ఉరుకులాటలు నేను  గమనిస్తూనే ఉన్నా” అని అన్నారు.