- రాష్ట్రాన్ని కోవర్ట్ ఆపరేషన్ల అడ్డా చేశారు
- ఆదమరిస్తే.. ఆర్థిక రాజధాని ఆగమైతదన వ్యాఖ్య
- 12 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.. ఇది ఎన్నిక కాదు.. ధర్మయుద్ధం
- మూడు రాష్ట్రాల్లో గ్యారెంటీలు అమలు చేశాం
- కేంద్ర మంత్రితో కమిటీ వేయండి నిరూపిస్తం
- పుణెలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్
పుణె: ఇద్దరు గుజరాతీలు దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రను దోచుకునేందుకు ప్లాన్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ పుణెలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై అడ్డాగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ.. కోవర్ట్ ఆపరేషన్ తో మహారాష్ట్రను విద్రోహుల అడ్డాగా మార్చారని అన్నారు. 11 ఏండ్లలో మహారాష్ట్రకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు. ఒకప్పుడు అంబానీ, అదాని కోసం పనిచేసేవారని, ఇప్పుడు కేవలం అదానీ కోసమే పనిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో గ్యారెంటీలన్నీ అమలు చేశామని పునరుద్ఘాటించారు.
కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ వస్తే తాను సచివాలయంలో కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని గణాంకాలతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తప్పని నిరూపిస్తే క్షమాపణ కోరుతానని అన్నారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక కార్పొరేట్ కంపెనీల అప్పులు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని, తాము రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. చిన్న కార్యకర్త శిందేను బాలాసాహెబ్ మంత్రి వరకు తీసుకువస్తే ఆయనను ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మోదీకి గులాంగా మారారని, శరద్ పవార్ సొంత బిడ్డను కాదని సోదరుని కుమారుడు అజిత్ పవార్‌కు మంత్రి పదవులు ఇస్తే ఆయనను మోదీకి గులాంగా మారారని ఆరోపించారు.
అశోక్ చవాన్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన మోదీకి గులామయ్యారన్నారు. ముంబయిలోని ధారావిని కబ్జా చేసేందుకు విద్రోహులైన శిందే, అజిత్ పవార్, అశోక్ చవాన్‌ను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. 12 కోట్ల మహారాష్ట్ర ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, ఇది ఎన్నిక కాదని, ధర్మయుద్ధమని అన్నారు. ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ లో విభేదాలంటూ వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో 95 శాతానికిపైగా ప్రజలు హిందువులు.. వారు బీజేపీకి ఓటు వేయలేదని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని చెప్పారు.