ఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

ఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

తెలంగాణలోని అసంపూర్తిగా ఉన్న పలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.  కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు సాగునీటి ప్రాజెక్టులను  త్వరగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 

నీలంవాగు, పింప్రి, పాలెంవాగు, మత్తడివాగు, ఎస్సార్ఎస్పీ స్టేజ్-2, సదర్మాట్ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తిచేయాలని అధికారులను సీఎం  ఆదేశించారు.  రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.  ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం అంచనాలు రూపొందించింది. 

అయితే తక్కువ నిధులతో  పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, 2025 మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని సీఎం నిర్ణయం  తీసుకున్నారు. అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని,  ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో  సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.