ఎడ్యుకేషన్​పై సీఎం స్పెషల్ ఫోకస్

ఎడ్యుకేషన్​పై సీఎం స్పెషల్ ఫోకస్
  • స్టూడెంట్లు, ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
  • పారదర్శకంగా ముగిసిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు 
  • బడులు తెరిచిన రోజే యూనిఫాంలు,పుస్తకాలు పంపిణీ 
  • ఈ నెల 18 నుంచే 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టూడెంట్ల నుంచి ఎంప్లాయీస్ వరకు అందరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరోపక్క సర్కారు బడుల్లో ఫెసిలిటీస్​ కోసం పనులు నిర్వహిస్తున్నారు. బడుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 11 వేలతో మెగా డీఎస్సీని వేశారు.

కొత్త సర్కారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే విద్యారంగంలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్లలో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ ప్రహసనంగా ఉండేది. ఒక్కోసారి ఏడాది పూర్తయినా పుస్తకాలు అందేవి కాదు.

యూనిఫాంల పరిస్థితీ అంతే. కానీ, ఈసారి అలాంటి పరిస్థితి రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే అధికారులకు సూచించారు. ఫలితంగా బడులు తెరిచిన తొలి రోజే పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ ప్రారంభమైంది. జులై నెలాఖరుకు పార్ట్–2 పుస్తకాలు, ఆగస్టు నెలాఖరుకు రెండో జత యూనిఫాం అందజేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్ ను కూడా ప్రభుత్వం అందజేసింది. 

బడుల రిపేర్లకు రూ.667 కోట్లు

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే బడుల బాగులో మహిళల పాత్ర కీలకమని భావించింది. దీనికి అనుగుణంగా అన్ని సర్కారు బడుల్లో మహిళా సంఘాల ప్రతినిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో బడుల్లో తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ స్విచ్​లు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల రిపేర్లు, గదులకు రంగులు వేయడం వంటి పనులను ప్రభుత్వం వేసవిలోనే చేపట్టి దాదాపు పూర్తి చేసింది. ఈ పనుల కోసం ఏకంగా  రూ.667.25 కోట్లు కేటాయించింది.

నెల రోజుల్లోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం తొలిసారిగా ఈ ప్రక్రియను ఆన్​లైన్​లో నిర్వహించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెలలోనే ప్రక్రియను ముగించింది. పది మంది స్టూడెంట్లు ఉన్న బడుల్లో ఒక టీచర్​ను, 11 నుంచి 40 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరిని, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురిని, 60పైన విద్యార్థులున్న బడుల్లో అక్కడ మంజూరైన పోస్టులను నింపేలా చర్యలు చేపట్టింది. సుమారు 30 వేలకు పైగా టీచర్ల బదిలీలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే 19 వేల మందికిపైగా టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. 

టీచర్ల రిక్రూట్మెంట్​పై దృష్టి 

టీచర్ల రిక్రూట్మెంట్ పైనా సర్కారు దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. దాన్ని రద్దు చేసి, వాస్తవ ఖాళీల ఆధారంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.  ఈ నెల18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మే, జూన్​లో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. 

ఐటీఐలు ఏటీసీలుగా.. 

గతంలో ఐటీఐల్లో చదివిన వారికి పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరికేవి. కొందరు స్వయం ఉపాధి పొందేవారు. కానీ, మారిన కాలానికి అనుగుణంగా ఐటీఐల్లో సిలబస్ మార్చకపోవడం, ఆధునిక పరిశ్రమల అవసరాలు తీర్చేవిధంగా శిక్షణల్లో మార్పు లేకపోవడంతో ఐటీఐల్లో చేరే వారు కరువయ్యారు. దీంతో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐటీఐలను ఆధునీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) తీర్చిదిద్దాలని నిర్ణయించి.. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీఎల్)తో ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నది. ఆధునిక కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే పరికరాలు, శిక్షకులను టీటీఎల్ సమకూర్చనుంది. ఇందుకు టీటీఎల్ రూ.2,016 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లు ఖర్చు చేయనున్నాయి. పరిశ్రమలు 4.0 అవసరాలకు తగిన నిపుణులను ఈ ఏటీసీలు అందివ్వనున్నాయి. ఏటీసీలకే పరిమితం కాకుండా స్కిల్​​యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్​

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు వేర్వురు చోట్ల, కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ ఒకే క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గురుకులాలన్నీ ఒకే చోట ఉంటే విద్యార్థుల మధ్య స్నేహసంబంధాలు పెరగడంతో పాటు విద్య, క్రీడాపరమైన పోటీ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ స్కూళ్ల నిర్మాణానికి జిల్లాల్లో స్థలం గుర్తింపు పనులు సాగుతున్నాయి. కొడంగల్, మధిర వంటి చోట ఈ దిశగా తొలి అడుగు పడింది. 

అదనపు నిధులు మంజూరు..

గత ప్రభుత్వం విద్యా శాఖకు సంబంధించి రూ.వందల కోట్లు బకాయిలు పెట్టింది. మధ్యాహ్న భోజన బిల్లులకు రూ.50 కోట్లు బకాయి పెట్టగా.. రేవంత్​సర్కారు వాటిని రిలీజ్ చేయడంతో పాటు మరో రూ.50.45 కోట్లు చెల్లించింది. ఇంకో రూ.52.07 కోట్లు త్వరలో విడుదల చేయనుంది. కోడి గుడ్ల బకాయిల చెల్లింపునకు ఇప్పటికే రూ.13.82 కోట్లు డీఈఓలకు రిలీజ్ చేసింది.