- లండన్ లోని థేమ్స్ నది పరిశీలన
- నిర్వహణపై అక్కడి అధికారులతో భేటీ
- 3 గంటలపాలు అధికారులతో చర్చలు
హైదరాబాద్: మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగనుంది. లండన్ లోని థేమ్స్ నదిని తలపించేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఇవాళ థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో లండన్ లో ఆయన సమావేశమయ్యారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో థేమ్స్ నది పరిరక్షణ, అభివృద్ధిలో ఏర్పడ్డ హార్డిల్స్ పై అడిగి తెలుసుకున్నారు. మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానా పూల్ అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్ షా 1578 లో నిర్మించాడు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయా పూల్ వంతెన హైకోర్టు సమీపంలో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్, ఉప్పల్ కలాన్ వద్ద కూడా వంతెనలు ఉన్నాయి. హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువగా మారింది. ప్రతిరోజూ జంటనగరాల నుంచి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా.
థేమ్స్ తరహాలో అభివృద్ధి
లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ది చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అలా చేయడం ద్వారా నగర సుందరీకరణతో పాటు కాలుష్యం కోరల నుంచి హైదరాబాద్ ను బయట పడేయొచ్చని భావిస్తుంది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాము మూసీ అభివృద్ధి కోసం సహకరిస్తామని వారు తెలిపారు.