
గత ప్రభుత్వ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు నీళ్లియ్యలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి . ఖమ్మంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్, హరీష్ రావు ప్రాజెక్టులను రీ డిజైన్ల పేరుతో అంచనాల పెంచి దోచుకున్నారు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. దూలం లెక్క పెరగటం కాదు దూడకు ఉన్న బుద్ధి ఉండాలి అంటూ హరీష్ రావుని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్, హరీశ్ చెల్లని రూపాయి లాంటి వాళ్లని విమర్శించారు సీఎం రేవంత్.
కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ . దోపిడీ బయటపడుతుందనే బీఆర్ఎస్ నేతలు పదేళ్లు ఏ ప్రాజెక్ట్ డీపీఆర్ లు ఇవ్వలేదన్నారు .ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదన్నారు. తమ శ్రమను హరీశ్ రావు చులకన చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టడానికి కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్ట్ పంపులను ఆన్ చేయలేదన్నారు. తాము నీళ్లు చల్లుకోలేదు..గోదావరి తల్లి తమ మీద నీళ్లు చల్లిందన్నారు. నల్గొండ జిల్లాలోనూ అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు రేవంత్. పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందన్నారు రేవంత్ .
1500 కోట్లతో పూర్తి కావాల్సిన ఇందిరా సాగర్ ప్రాజెక్టును ..18వేల కోట్ల అంచనాకు పెంచారని చెప్పారు సీఎం రేవంత్. రూ. 7500 కోట్లు ఖర్చు చేసి చుక్కనీరు గుంట భూమికి ఇవ్వలేదని ద్వజమెత్తారు. తమ మంత్రుల మధ్య ఎంతో పోటీ ఉందని.. అందుకే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు పారించాలనే ప్రయత్నిస్తున్నామని చెప్పారు . ప్రాజెక్టులను నాలుగు భాగాలుగా విభజించామన్నారు. 80 శాతం పెరిగి ..60శాతం, 4 శాతం, 20 శాతం ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు.