Bharat Summit 2025: దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం: భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి

Bharat Summit 2025: దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం: భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించామని, దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే అజెండాగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని, సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం చెప్పారు.

దేశంలో అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రైతులకు సుమారు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 

నిరుద్యోగులకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్లో ప్రస్తావించారు. దక్షిణ కొరియా, దావోస్లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించామని, రాజీవ్ యువ వికాసం కార్యక్రమంతో యువతకు ఉపాధి కల్పించబోతున్నామని సీఎం రేవంత్ వివరించారు.

పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా తెలంగాణ మహిళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, దేశానికే రోల్ మోడల్గా నిలిచే కులగణన చేపట్టామని సీఎం తెలిపారు.

భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:

* పదేండ్లలో తెలంగాణ ప్రజల కల నెరవేరలేదు
* ప్రజల ఇష్టం ప్రకారం మా ప్రభుత్వం నడుస్తోంది
* రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం
* ఇది ఇండియాలో అతిపెద్ద రుణమాఫీ
* రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
* సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం
* పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం
* సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తున్నాం
* పదేండ్లల్లో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది
* మేము వచ్చాక ఏడాదిలోనే 57 వేల ఉద్యోగాలిచ్చాం
* ఇటీవల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు సాధించాం
* సెల్ఫ్ హెల్త్ గ్రూపులను బలోపేతం చేస్తున్నాం
* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నాం
* మొదటి ఏడాదిలో రూ.22 వేల కోట్ల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం
* ఫ్రీ బస్సు స్కీంకు రూ.500 వేల కోట్లు ఖర్చు చేశాం
* రాజీవ్ ఆరోగ్య శ్రీ మా పథకాల్లో మరో అద్భుతమైన పథకం
* పేదలకు కార్పొరేట్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఇస్తున్నాం
* అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం
* రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్య వింటున్నాం
* దీని కోసం ప్రజావాణిని నిర్వహిస్తున్నాం
* మేము ఇటీవలే ఎస్సీ వర్గీకరణ చేశాం
* థర్డ్ జెండర్ను పోలీస్ శాఖలో రిక్రూట్ చేసుకున్నాం
* తలసరి ఆదాయంలో మేము టాప్లో ఉన్నాం