కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి

మానుకోట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  దేశంలో ఇండియా కూటమి గెలవబోతుందని.. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని చెప్పారు.  మహబూబాబాద్ లో జరిగిన జనజాతర సభలో సీఎం పాల్గొన్నారు.  తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదని విమర్శించారు సీఎం.  రాష్ట్రానికి ఏం చేయని  బీజేపీని  బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలోని కుంభమేళాకు వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం... మేడారం జాతరకు ముష్టి రూ. 3 కోట్లు ఇచ్చిందని సీఎం మండిపడ్డారు.  మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన కిషన్ రెడ్డికి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని రేవంత్ ప్రశ్నించారు.  

ఢిల్లీ మోదీ, ఫాం హౌజ్ కేడీ ఇద్దరు తోడు దొంగలని సీఎం  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్  ను గద్దె దించారని..  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బండకేసి కొట్టాలని ప్రజలకు  పిలుపునిచ్చారు.   కవిత బెయిల్ కోసం కేసీఆర్ ప్రధాని మోదీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని  సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.  5 ఎంపీ సీట్లను కేసీఆర్ ..  బీజేపీకి అమ్ముకున్నారన్నారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ ..   మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారని చెప్పారు.   ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు  ఒక్క సీటు కూడా ఇవ్వొద్దన్నారు సీఎం. 

తెలంగాణలో పదేళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని  సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు.  దిగిపోవడానికి తాము  అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదన్నారు సీఎం.  ఇప్పటికే వందరోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని..   ఆగస్టు 15లోపు 2లక్షల రూణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని  చెప్పారు   సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా  రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని తెలిపారు.  మహబూబాబాద్  లో  బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం  కోరారు.   తండ్రి రెడ్యానాయక్ ను ఇంటికి పంపినట్టే ఆయన  బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.