ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఐటీఐని ఏటీసీగా మారుస్తున్నామని చెప్పారు. 50 కోట్లతో మల్లేపల్లిలో ఏటీసీని నిర్మిస్తున్నామని తెలిపారు.
పదేండ్లుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయన్నారు సీఎం రేవంత్ . యువతనకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలరని చెప్పారు. 40 లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతున్నారని తెలిపారు. సాంకేతిక నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలకు దారి చూపెడుతుందన్నారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవని.. ప్రపంచంతో పోటీపడాలంటే సర్టిఫికెట్లతో పాటు సాంకేతికత అవసరమన్నారు. విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాము పాలకులం కాదు..సేవకులం అని అన్నారు.
రూ. 2324 కోట్లతో 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని చెప్పారు రేవంత్. సాంకేతికతను అందించడానికి ముందుకొచ్చిన టాటాను అభినందిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో ప్రతి నలులగురిలో ఒకరు తెలుగు వాళ్లు ఉన్నారన్నారు. త్వరలో రాష్ట్రంలో నలుమూలలా ఏటీసీలు ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగలుకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తామని చెప్పారు. ఐటీఐలను ఎంత అభివృద్ధి పరిస్తే అంత మంచిదన్నారు. ఐటీఐలు ఇంతకు మందు వేరు ఇపుడు వేరు.. ఇక ముందు ఐటీఐలను తానే పర్యవేక్షిస్తానని చెప్పారు రేవంత్.