హైదరాబాద్: కాకా ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం అని సీఎం రేవంత్ రెడ్డి కీర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి నేతల్లో కాకా వెంకట స్వామి ముఖ్యులు అని సీఎం గుర్తుచేశారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కాకా జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్లు అసూయతోనో, ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేశారని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోసమే కాంగ్రెస్తో టీఆర్ఎస్కు పొత్తు కుదిర్చారని సీఎం చెప్పారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్లోకి ఆహ్వానించామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను కాకా కుటుంబం సద్వినియోగం చేసుకుందని సీఎం తెలిపారు.