- బుల్డోజర్లతో తొక్కించుకుంటూ వెళ్లయినా పూర్తి చేస్తం
- మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి
- అణుబాంబు కంటేప్రమాదకరంగా మూసీ కాలుష్యం
- నదిని బాగుచేయకపోతే రానున్న రోజుల్లోహైదరాబాద్లో విస్ఫోటనం తప్పదు
- సబర్మతిని మోదీ బాగుచేస్తే ఒప్పు.. ఇక్కడ మేం చేస్తే తప్పా?
- మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నయ్
- ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే..అసలు సినిమా ముందుంది
- జనవరిలో వాడపల్లి నుంచిచార్మినార్ దాకా పాదయాత్ర చేస్తా
- బిల్లా, రంగాలు రావాలంటూకేటీఆర్, హరీశ్‌కు సవాల్
హైదరాబాద్/యాదాద్రి, వెలుగు : ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్డొచ్చినోళ్లను బుల్డోజర్లతో తొక్కించుకుంటూ వెళ్లయినా ప్రక్షాళన పూర్తి చేస్తామని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. ఇందుకు సంగెం శివయ్య సాక్షిగా సంకల్పం తీసుకుంటున్నానని చెప్పారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మూసీ నది వెంట 5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు కొందరు దుర్మార్గులు అడ్డొస్తున్నారని, వాళ్లలో బీఆర్‌ఎస్ నేతలు ముందున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని ఫైర్ అయ్యారు.
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వంతో కమ్యూనిస్టులు కలిసి వస్తున్నారని, వాళ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ‘‘జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబుల కన్నా అత్యంత ప్రమాదకరంగా మూసీ తయారైంది. మనం ఇప్పుడే మేల్కోకపోతే రాబోయే రోజుల్లో అతిపెద్ద అణుబాంబు విస్ఫోటనాన్ని హైదరాబాద్ ఎదుర్కోవాల్సి వస్తుంది” అని అన్నారు.ఒకప్పుడు జీవనదిగా ఉన్న మూసీ.. ఇప్పుడు విషంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అనంతగిరి కొండల్లో పుట్టి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ మీదుగా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో మూసీ కలుస్తుంది.
ఒకప్పుడు మంచి నీటిని అందించిన మూసీ.. ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతున్నది. ‘పాలకులు పగ పట్టారా? దేవుడు శాపం పెట్టిండా?’ అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లోని చేపలను, ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు. ఇక్కడి పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. పాడిపంటలతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. గీత కార్మికులు గీసే కల్లు కూడా కలుషితమైంది. ఇక్కడ పెంచిన గొర్రెలను తినడం వల్ల జనం రోగాల పాలవుతున్నారు.
ఇక్కడి గొల్లకురుమలు మూసీ నీళ్ల గడ్డి తింటున్న గొర్రెలను సైతం అమ్ముకోలేకపోతున్నారు. మూసీ నీళ్లతో పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు వ్యవసాయం బంద్ చేసే పరిస్థితులున్నయ్. మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదు. ఒకవేళ గర్భం దాల్చిన అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారు” అని వాపోయారు. వరంగా మారాల్సిన మూసీ నది.. శాపంగా మారితే బాగు చేయవద్దా? అని ప్రశ్నించారు.
ఒకప్పుడు రూపాయి బిల్ల వేస్తే కనిపించేది..
బీఆర్ఎస్ లీడర్లకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘దశాబ్దాల కింద మూసీ నదిలో రూపాయి బిల్లవేస్తే కనిపించేదని ఇక్కడి ప్రజలు చెప్పారు. అలాంటి మూసీ కావాలని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. నదిని పునరుజ్జీవింపజేయాలని కోరుతున్నారు. తమ జీవితాలు మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. వారి జీవితాలను నేను మారుస్తాను” అని హామీ ఇచ్చారు. మూసీ నదికి ఓ ప్రత్యేకత ఉందని.. తెలంగాణలోనే పుట్టి ఇక్కడే నల్గొండ జిల్లాలోని త్రివేణి సంగమంలో కలుస్తుందని చెప్పారు.
కేసీఆర్..మూసీ బాధితుల బాధ పట్టదా?
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘3 నెలలు నీ బిడ్డ జైలుకు పోతే నీకు దుఃఖం వచ్చింది. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా?’’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘కేసీఆర్.. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు” అని హెచ్చరించారు. అవినీతి, దోపిడీ కోసం మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరెన్ని చేసినా మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.
మోదీ చేస్తే ఒప్పు..మేం చేస్తే తప్పా?
బీజేపీ నేతల తీరుపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ గుజరాత్లో సబర్మతిని బాగుచేసినా, రూ.40 వేల కోట్లు పెట్టి గంగానదిని ప్రక్షాళన చేసినా.. ఆ విషయాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మేం మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకుంటున్నారు. నేనుఅవినీతికి పాల్పడుతున్నానంటూ కొందరు దొంగ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘ఇయ్యాల సంగెం రావడంతో నా జన్మధన్యమైంది. సంగెం శివయ్యను దర్శించుకుని మూసీని ప్రక్షాళన చేయాల్సిందేనని సంకల్పం తీసుకున్నాను’’ అని చెప్పారు.
మీలెక్క దోచుకోవడానికి రాలే..
రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టి దోచుకోవడానికి తాను రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘మూసీ ప్రాజెక్టు కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అందులో రూ.25 వేల కోట్లు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. దోచుకోవాలని అనుకుంటే.. నల్గొండ, రంగారెడ్డి ప్రజలను ముంచాలా? మీలెక్క ధరణిని అడ్డం పెట్టుకుని కోకాపేటలో 100 ఎకరాలు కబ్జా పెడితే రూ.10 వేల కోట్లు వస్తయ్. 500 ఎకరాల భూమిని అబ్రకదబ్ర చేస్తే రూ.50 వేల కోట్లు వస్తయ్. మీరు భూములు మాయం చేసినట్టు అటు ఇటు చేసి దోపిడీ చేయలేమా?’’ అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు.
కానీ తాను అలా దోచుకోవడానికి రాలేదని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను సీఎం కుర్చీలో కూర్చోలేదని, జనమే తమ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. ‘‘మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో కుక్క చావే గతి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే చరిత్రహీనులుగా మిగులుతారు’’ అని అన్నారు. యాత్రలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రక్షాళనకు అడ్డుపడితే జనం మూసీలో ముంచుతరు..
జనవరిలో వాడపల్లి నుంచి చార్మినార్దాకా పాదయాత్ర చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘ఈరోజు మొదలుపెట్టిన పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా జనవరిలో ఉంటది. 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్ పూర్తవుతుంది. బిల్లా, రంగాలకు సవాల్ విసురుతున్నా.. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ లోని చార్మినార్ వరకు పాదయాత్ర మొదలుపెడతా. బిల్లా, రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.
‘‘బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని కొందరు అంటున్నారు. ఎవరు అడ్డం వస్తారో రండి.. ఎంత మంది వస్తారో రండి.. ఎవరెవరు అడ్డుపడుతారో పేర్లు ఇవ్వండి. మీ జాతి మొత్తాన్ని తెచ్చుకున్నా సరే.. అందరినీ నల్గొండ ప్రజలతో బుల్డోజర్ ఎక్కించి తొక్కిస్తా. లేకుంటే నా పేరు మార్చుకుంట. బిల్లా, రంగాలకు ధైర్యం ఉంటే.. తేదీ చెప్పండి. మా వెంకన్న (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)ని బుల్డోజర్ పై ఎక్కిస్తా. మా మందుల సామేల్‌తో జెండా ఊపిస్తా. ఎంత మంది వచ్చి అడ్డం పంటరో పండుకోండి.. ఎక్కించి తొక్కిస్తా రండి’’ అని హెచ్చరించారు.
కేసీఆర్.. నీకు మూసీ బిడ్డల బాధలు పట్టవా..?
మూసీ కాలుష్యంతో ఇక్కడి చేపలను, పండిన పంటలను ఎవరూ తింటలేరు. పశువుల పాలు, తాటి చెట్ల కల్లు కూడా తాగుతలేరు. ఇక్కడి మహిళలకు పిల్లలు పుట్టడం లేదు. పుట్టినా అంగవైకల్యంతో పుడుతున్నారు. ఒకప్పుడు వరంగా ఉన్న మూసీ.. ఇప్పుడు శాపంగా మారింది. కేసీఆర్.. ఇక్కడి ప్రజల బాధలు నీకు పట్టవా? నీ బిడ్డ 3 నెలలు జైలుకు పోతే నీకు దుఃఖం వచ్చింది. కానీ మూసీ పరివాహక బిడ్డల జీవితాలే పోతుంటే నీకు పట్టదా? మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నవ్. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటేమూసీలోనే పాతరేస్తరు.
సీఎం రేవంత్ రెడ్డి