
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణ త్యాగం చేశారని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. మేం అధికారంలోకి రాగానే ఈ అంశంపై దృష్టి పెట్టామని.. ఇందులో భాగంగానే 50 వేల మందికి వాళ్ల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోన్న ఉద్యోగాలకు తామే నోటిఫికేషన్లు ఇచ్చామని బీఆర్ఎస్ అంటోంది.. మరీ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు.. నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు మేం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 59 వేలు.. స్వాతంత్ర్యం వచ్చాక ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోన్న ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని.. కోర్టుల్లో కేసులు వేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వాళ్లు చేయలేని పని మేం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని.. మాకు ఉద్యోగాలు ఇవ్వని మీకు ఉద్యోగాలు ఎందుకని నిరుద్యోగులు బీఆర్ఎస్ను ఓడించారని అన్నారు.
ALSO READ | మార్చి 23న సిద్దిపేట లో జాబ్ మేళా : ఎమ్మెల్యే హరీశ్ రావు
గురువారం (మార్చి 20) హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలో 922 మందికి కారుణ నియామక పత్రాలు అందించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి కారుణ్య నియామకాలు నిలిపివేశారు. పదేండ్లు మీ జీవితాన్ని బీఆర్ఎస్ వృధా చేసింది’’ అని విమర్శించారు.
తెలంగాణ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది త్యాగం చేశారని.. దేని కోసం అయితే వారు కొట్లాడారో ప్రత్యేక రాష్ట్రంలో వాళ్ల ఆకాంక్షలు నేరవేరలేదని అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అన్ని పరీక్షలు చిత్తశుద్ధితో నిర్వహించామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు వేయాలని ధర్నాలు చేస్తే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడే పరీక్షలు వద్దు అని నిరుద్యోగులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కు బిడ్డ, కొడుకుపై ఉన్న ప్రేమ పేద పిల్లలపై లేదని.. మీ ఇంట్లో నాలుగైదు ఉద్యోగాలు.. పేదల పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వద్దా అని ప్రశ్నించారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడంతో తమ సత్తా ఏంటో ఎన్నికల్లో బీఆర్ఎస్కు రుచి చూపించారన్నారు.