
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజధానితో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ఆయన పలు సూచనలు చేశారు.
వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అదనపు భూసేకరణ విషయంలో ఖర్చుకు వెనకాడొద్దన్నారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రాజు, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు వి. శేషాద్రి, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.