- అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలెట్ ప్రాజెక్టు: సీఎం రేవంత్
- రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, స్కీమ్స్ డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ
- బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు
- పైలెట్ ప్రాజెక్ట్ ఏరియాల్లో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీసర్లకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో అందజేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళే యజమానిగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘రేషన్,హెల్త్, ఇతర స్కీముల న్నింటికీ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి. కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా ఉండాలి. ఇతర కుటుంబసభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉండేలా చూడాలి’’ అని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై శనివారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ సమీక్షించారు.
ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్రలో పర్యటించిన ఆఫీసర్లు తమ అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
రేషన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఐటీ, వ్యవసాయ, సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోరెండు చోట్ల డోర్టు డోర్ పరిశీలన
ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమచార సేకరణ, వాటిల్లో ఏమేమి పొందుపర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రివర్గ ఉప సంఘానికి అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో డిటైల్డ్ రిపోర్టు రూపొందిం చాలన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల చొప్పున (ఒకటి రూరల్, ఒకటి అర్బన్) పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని తొలుత ఆయా ఏరియాల్లో డిజిటల్ కార్డుల ప్రక్రియను అమలుచేయాలని సీఎం సూచించారు.
పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు.. పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో రెండు వార్డులు, డివిజన్లను ఎంపిక చేయాలన్నారు. కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్ 3 నుంచి పైలెట్ ప్రాజెక్టు ఏరియాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టు డోర్) పరిశీలన చేయించాలని ఆఫీసర్లకు ఆయన సూచించారు.
మొత్తంగా పైలెట్ ప్రాజెక్టుగా 238 చోట్ల డిజిటల్ కార్డుల ప్రక్రియను అమలు చేయాలని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో స్థాయి అధికారిని.. పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ ఆదేశించారు.
క్షేత్ర స్థాయి పరిశీలన సమగ్రంగా కచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.