- ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బలరామ్ నాయక్‌ను గెలిపించాలి
- పదేళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలు చేసింది ఏమీ లేదు
- సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మహబూబాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోరిక బలరామ్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మానుకోటను కాంగ్రెస్ కంచుకోటగా మరోసారి చాటిచెప్పాలన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారే ఉన్నారని, గిరిజనులంతా కాంగ్రెస్‌కు అండగా ఉన్నారని తెలిపారు. గతంలో తొలిసారి ఎంపీగా గెలిచిన పోరిక బలరామ్ నాయక్‌ను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిని చేసిందని, మళ్లీ ఆదరిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన డీఎస్ రెడ్యానాయక్‌ను ప్రజలు ఇంటికి పంపారని, నేడు ఆయన కుమార్తె బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌తోనే గిరిజనులకు మేలు: మంత్రి సీతక్క
కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు సముచిత న్యాయం జరుగుతుందని మంత్రి సీతక్క చెప్పారు. పేదల కోసం ఈజీఎస్, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. బీజేపీ మూలంగా మతవిద్వేశాలు తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
మిరపకాయ పవరేంటో చూపిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల లిల్లీపుట్అంటూ అవహేళన చేస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ మిరపకాయ లాంటివాడని, అవసరమైనచోట అవసరమైన మేరకు వాడటం జరుగుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు టచ్‌లో ఉన్నారని పోరంబోకు మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు.
గిరిజనులు కాంగ్రెస్‌కు అండగా నిలవాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
మానుకోట పార్లమెంట్ పరిధిలో మరోసారి గిరిజనులు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. కొంత మంది అవకాశవాదులు రాష్ట్రంలో అధికారం కోసం నూతికాడి గుంటనక్కలా చూస్తున్నారని, వారే గోతిలో పడటం ఖాయమన్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో మానుకోట మొత్తం మూడు రంగుల మయంగా మారింది.
సమావేశంలో ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు తెల్లము వెంకట్రావ్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, యశస్వినిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, బెల్లయ్య నాయక్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ, రీయాజ్, సీసీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి తదితరులు పాల్గొన్నారు.