హైదరాబాద్​కు చార్లెస్ ​స్క్వాబ్.. ఐదు రోజుల్లో 10 ఒప్పందాలు

హైదరాబాద్​కు చార్లెస్ ​స్క్వాబ్.. ఐదు రోజుల్లో 10  ఒప్పందాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి టీమ్​ అమెరికా పర్యటన సాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో ఐదు రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్ష్​ కార్రా, స్వచ్ఛ్​ బయో, ట్రైజిన్​ టెక్నాలజీస్​ లాంటి కంపెనీలున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్​బ్యాంక్ ​సహకారాన్ని సాధించడం విశేషం. 

బుధవారం రాత్రి వరకు న్యూయార్క్​, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్​లో పర్యటించిన సీఎం రేవంత్​ రెడ్డి టీమ్​ గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. అక్కడ సైతం వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్​లో ప్రపంచంలోనే  పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్​లో టెక్నాలజీ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్​లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్​ డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.


ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్​మెంట్​సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు చార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్​కు పంపించనున్నట్టు తెలిపింది.  భారత్​లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావడం విశేషం. 

ఈ నెల 4 నుంచి పెట్టుబడుల యాత్ర..

ఈ నెల 4 నుంచి అమెరికాలో సీఎం రేవంత్​ టీం పెట్టుబడుల యాత్ర మొదలైంది. తొలిరోజు కాగ్నిజెంట్..  అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నది. దీంతో దాదాపు 15,000 ఉద్యోగాలు రానున్నాయి.  వాల్ష్ కార్రా హోల్డింగ్స్ వీ హబ్​లో  5 మిలియన్ డాలర్ల (దాదాపు 42కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్​ చేసకున్నది. దీంతో పాటు  అభివృద్ధి చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్​ డాలర్లు (దాదాపు 840 కోట్లు) ఇన్వెస్ట్​మెంట్​ చేయనున్నట్టు వెల్లడించింది. ఆర్సీసియం ఎక్స్​పాన్షన్​తో దాదాపు 500  హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు.  స్వచ్ఛ్ బయో రూ.1000 కోట్ల పెట్టుబడులతో పాటు  500 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఎంవోయూ కుదిరింది.  ట్రైజిన్ టెక్నాలజీస్   హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్‌మెంట్, డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నది. 

దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. హెచ్​సీఏ హెల్త్ కేర్ లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ చేపట్టనున్నది.  కార్నింగ్  కంపెనీ గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించేలా అగ్రిమెంట్​ కుదిరింది. ఒక ప్లాన్​తో ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు.  వివింట్ ఫార్మా తో  రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. చార్లెస్ స్క్వాబ్​తో  హైదరాబాద్ లో భారత్​లోనే మొదటి టెక్నాలజీ డెవలప్​మెంట్​సెంటర్​ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు.  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం అందించేందుకు వరల్డ్ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. 

డల్లాస్​లో మహాత్ముడికి సీఎం నివాళి

డల్లాస్‌ నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులు డీ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీఎం నివాళి అర్పించారు.  మహాత్ముడి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా, డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఈ గాంధీ విగ్రహం అమెరికాలోనే అతి పెద్దది కావడం విశేషం. ఇక సీఎం రేవంత్​ రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియా వెళ్లింది. అక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎన్ఆర్ఐలు ఝాన్సీ రెడ్డి, రాజేందర్​ రెడ్డి వారికి ఘనస్వాగతం పలికారు.