- ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే చాన్స్
- కేబినెట్ విస్తరణపైనా చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం తిరిగి హైద రాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు ప్రకటించాయి. ఒకవేళ సమయం కుదిరితే రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియెట్ ప్రాంగణంలో లక్ష మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుందామని ఆయనకు, రాష్ట్ర ఇతర మఖ్యనేతలకు ఏఐసీసీ తెలిపింది. మంత్రివర్గ విస్తరణపై కూడా తాజాగా హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.