ఫిబ్రవరి 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

 ఫిబ్రవరి 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : ఈనెల 23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రానున్నట్లు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. బుధవారం యాదగిరిగుట్టకు వచ్చిన ఆమె.. సీఎం రాక, ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు, అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు యాదగిరిగుట్టకు రానున్న నేపథ్యంలో.. భద్రతాపరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ఆదేశించారు.

వీఐపీలు, వీవీఐపీల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రొటోకాల్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న సందర్భంగా మౌలిక సదుపాయాలు, శానిటేషన్, ఆలయ పరిసరాల పరిశుభ్రత, వాష్ రూమ్స్, టాయిలెట్స్, తాగునీటి కల్పనపై  ఫోకస్ పెట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మి, జడ్పీ సీఈవో శోభారాణి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, ఏసీపీ రమేశ్ కుమార్, తహసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీవో నవీన్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులుపాల్గొన్నారు.